ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ (86) చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్ల పాటు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం విషమించింది. చెన్నై సంగీత అకాడమీ సమీపంలో ఉన్న ఆయన ఇంట్లోనే కుటుంబ సభ్యులు సపర్యలు చేస్తుండగానే.. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగృహంలోనే అభిమానుల సందర్శనార్థం ఉంచారు.
బాలమురళీకృష్ణ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని శంకరగుప్తం గ్రామంలో మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు 1930 జూలై 6వ తేదీన జన్మించారు. కేవలం 8 ఏళ్ల చిన్న వయసులోనే తొలిసారిగా కచేరీ చేశారు. 1939 నుంచి ఆయన పూర్తిస్థాయిలో కచేరీలు మొదలుపెట్టారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. స్వయంగా పాడటంతో పాటు పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. మహాతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి, సిద్ధి అనే కొన్ని కొత్త రాగాలను కూడా ఆవిష్కరించారు.
కర్ణాటక సంగీతంలో సమున్నత స్థానాన్ని అధిరోహించిన బాలమురళీకృష్ణ హిందుస్థానీ సంగీతం, పాశ్యాత్య సంగీతాల్లోనూ గొప్ప నైపుణ్యం సంపాదించారు. వేణువు, వయొలిన్, వీణ వాయిద్యాలతో చిన్నతనంలోనే సంగీతాన్ని వంటపట్టించుకున్నాడు. 15 ఏళ్ళ వయసు వచ్చే సరికే 72 మేళకర్త రాగాల్లో పట్టు సాధించారు.
వయొలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలను బాగా వాయిస్తారు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించారు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25వేల కచేరీలు చేసిన ఘనత ఆయనది. మాతృభాష అయిన తెలుగుతో పాటు సంస్కృతం, కన్నడ, తమిళ భాషల్లో కలిపి దాదాపు 400కు పైగా కర్ణాటక సంగీత బాణీల్లో కృతులు, వర్ణాలు, జావళులు, తిల్లానలు రచించిన బాలమురళి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందుకున్న పురస్కారాలకు లెక్కలేదు.