రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నాగోల్-బండ్లగూడ మార్గంలో ఉన్న ఫంక్షన్‌హాళ్లలో తాత్కాలికంగా పండ్ల విక్రయాలను జరిపేందుకు అన్ని వర్గాలతో చర్చించాలని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ సూచించారు. బుధవారం నిర్వహించిన గడ్డిఅన్నారం వ్యవసాయం మార్కెట్ కమిటీ అత్యవసర సమావేశంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్డిఅన్నారం మార్కెట్ మూసివేతకు దారితీసిన అంశాల గురించి పాలక వర్గ సభ్యులతో చర్చించారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ మార్కెట్‌ను మూసివేసినట్లు అధికారులు వివరించారు. ప్రతిరోజు 700-800 పండ్ల వాహనాలు గడ్డిఅన్నారం మార్కెట్‌కు వస్తున్నందున, విపరీతమైన రద్దీ ఏర్పడిందని, ఇరుకుగా ఉన్న ఈ మార్కెట్‌లో సదుపాయాలు తక్కువగా ఉన్నాయని, బౌతిక దూరం అమలు చేయుట కూడా ఇబ్బందిగా ఉన్నందున మార్కెట్‌ను మూసివేసినట్టు అధికారులు తెలిపారు.
ఏప్రిల్ 27 నుండి కోహెడకు తాత్కాలికంగా పండ్ల మార్కెట్‌ను తరలించినప్పటికీ, మే 4వ తేదీన వచ్చిన గాలిదుమారానికి షెడ్‌లపై ఉన్న రేకులు తొలగిపోయాయని వ్యవసాయ మార్కెట్ శాఖ సంయుక్త సంచాలకులు వి.శ్రీనివాస్ తెలిపారు. కోహెడ మార్కెట్ షెడ్ల మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. అదేవిధంగా రైతులు, బయ్యర్ల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న టాయిలెట్ బ్లాక్‌కు అదనంగా రూ. 10లక్షలతో రెండు టాయిలెట్ బ్లాక్‌లను నిర్మించాలని కమిటీ నిర్ణయించింది. అలాగే కోహెడ మార్కెట్ ముందు సురక్షిత త్రాగానీటిని సరఫరా చేయుటకు రూ. 15లక్షలతో ఆర్.ఓ ప్లాంట్ ఏర్పాటుచేసి, దానికి 2వేల లీటర్ల సామర్థ్యం గల రెండు వాటర్ ట్యాంక్‌లను, 900 మీటర్ల పైప్‌లైన్, ఇతర పనులను చేపట్టాలని కమిటీ తీర్మానించింది. అలాగే విపరీతమైన గాలిదుమారంతో కూడిన వర్షంతో దెబ్బతిన్న తాత్కాలిక షెడ్లను పునరుద్దరించేందుకు ఆమోదించారు.
కోహెడ పండ్ల మార్కెట్‌కు వచ్చే రైతుల సౌకర్యార్థం ప్రతిరోజు 2వేల భోజనాలను ఒక నెల పాటు ఉచితంగా అందించుటకై ఒక దాత ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రైతులకు భోజనం పెట్టేందుకు తాత్కాలికంగా ఒక షెడ్‌ను, త్రాగునీరు ఇతర సదుపాయాలను కల్పించాలని మేయర్ సూచించారు. అలాగే కోహెడ పండ్ల మార్కెట్ షెడ్ల మరమ్మతు పనులు పూర్తి అయ్యేందుకు 10-15 రోజులు పట్టే అవకాశం ఉన్నందున, రైతుల ప్రయోజనాలను కాపాడుటకై నాగోల్-బండ్లగూడ రహదారిలో ఉన్న పెద్ద పెద్ద ఫంక్షన్‌హాళ్లలో మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఈ అంశంపై స్థానిక శాసన సభ్యులు, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లతో చర్చించి, క్షేత్రస్థాయిలో ఉన్న వసతుల గురించి పరిశీలించాలని కోరారు. కోవిడ్-19 నేపథ్యంలో రైతులు, వ్యాపారస్తులకు వెసులుబాటుగా ఉంటుందని, ఈ యోచన చేస్తున్నట్లు తెలిపారు. పండ్ల సీజన్ అయినందున కోహెడ మార్కెట్‌ను కనీస వసతులతో వేగంగా పునరుద్దరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ వీరమల్ల రామనర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్ కందాల ముత్యం రెడ్డి, సభ్యులు కొత్త కిషన్‌గౌడ్, శగ రవీందర్, పన్నాల కొండల్ రెడ్డి, అడాల రమేష్, సుంకోజు క్రిష్ణమాచారి, మొద్దు లచ్చిరెడ్డి, బి.క్రాంతి ప్రభాత్‌రెడ్డి, మహ్మద్ అబ్దుల్ ఇబ్రహీం, ఘట్‌కేసర్ ఎఫ్.ఎస్.సి.ఎస్ ఛైర్మన్ ఎస్.రాంరెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, హార్టికల్చర్ డిడి ఎం.సునందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.