రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీ..

178
Free fertilisers to farming community

ఆత్మహత్యలు, అప్పుల బాధలేని తెలంగాణను త్వరలో చూడబోతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. రూ.17 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా జనహితలో  సీఎం కేసీఆర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన సీఎం దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా అవతరించిందని తెలిపారు. రైతులకు శుభవార్తనందించారు. వచ్చే సంవత్సరం నుంచి వందకు వందశాతం 26 లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా సరఫరా చేసి తీరుతామని చెప్పారు. దీంతో సభ రైతుల కరతాల ధ్వనులతో మార్మోగిపోయింది. చిల్లర రాజకీయాలను పక్కన బెట్టి తెలంగాణ ఉన్నన్ని రోజులు రైతులకు ఎరువులు ఫ్రీగా సరఫరా జరగాల్సిన పరిస్ధితి ఉందని తెలిపారు. ఎకరాకు 2 దుక్కిమందు, 3 యురియా బస్తాలు ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా వీటికయ్యే మొత్తం రూ. 4 వేలు వచ్చే ఏడాది మే నెలలో రైతుల బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు.

ప్రజలందరి సహకారంతో అద్భుతాలు సృష్టించామని వెల్లడించారు. తెలంగాణకు కోటి ఎకరాల గోదావరి నీళ్లు తీసుకొచ్చి తీరుతానని స్పష్టం చేశారు. వచ్చే నాలుగేళ్లలో తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మారడం ఖాయమని తెలిపారు.రెండేళ్లలో నాలుగున్నరకోట్ల గొర్రెలు తయారవుతాయని సీఎం తెలిపారు. రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.

గతంలో అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని…కానీ నేడు ఆ పరిస్ధితి మారిందని చెప్పారు. ఏ జిల్లాలో ఏ పంట ఎక్కువ పడుతుందో అధ్యయనం చేసి పంటలు పండిస్తే రైతులు లాభాల బాటపడుతారని తెలిపారు. భూసారానికి అవసరమైన పంటలు వేయాలని సూచించారు. క్రాప్ కాలనీలుగా తెలంగాణ వ్యవసాయం విభజన జరగాలని సీఎం సూచించారు. రైతులు తన పంటకు తానే ధర నిర్ణయించుకునే పరిస్ధితి రావాలన్నారు.

మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్ కు వరకు నీరందిస్తామన్నారు. వానలు పడిన పడకపోయినా నిజాం సాగర్ కింది ఆయకట్టుకు సాగునీరందిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నుంచి 1700 టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని చెప్పారు. నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో రాష్ర్ట రైతాంగం దెబ్బతిన్నది. రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చెరువులను గత పాలకులు నాశనం చేశారు. చెరువులను బాగు చేస్తున్నాం. చెరువులను పునరుద్ధరించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇక నుంచి ప్రతి రైతు తమ పంట పొలాల్లో ఏయే పంటలు పండుతాయో పరిశీలించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం, ఎంపీ కవితతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.