నాయకుడంటే ప్రజల మనసులు గెలవాలి. కష్టనష్టాల్లో అదుకోవాలి. నేనున్నాంటూ భరోసానివ్వాలి. అప్పుడే ఆ నాయకుల పై ప్రజలకు అభిమానం ఏర్పడుతుంది. ఒక్కసారి గుండెల్లో ఏర్పడిన అభిమానం వారిని జీవితాంతం వెన్నంటే ఉంటుంది. పదవిలో ఉన్నా.. లేకపోయిన ఆ నాయకుల అడుగుజాడల్లో నడిచేందుకు ఓ స్ఫూర్తిని పొందుతారు. సందర్భం వచ్చిన ప్రతిసారి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అది వెలకట్టలేనిది వారి ప్రేమకు ప్రతి రూపంగా ఉంటుంది. అలా ప్రజలకు చేరువైన నాయకులు అరుదుగా ఉంటారు. మంగళవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఓ సంఘటన నాయకుల పై ప్రజలకు అభిమానం ఎలా ఉంటుందో నిరూపించింది. దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే మోటారు ట్రై సైకిళ్ల మంజూరులో ఓ సోదరిగా.. తల్లిగా వారికి బాసటగా నిలిచిన తన ఎంపీ నిధుల నుంచి 471 మందికి రూ. 12వేల చొప్పున మొత్తం రూ. 57 లక్షలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించి ట్రై సైకిళ్ల మంజూరులో కీలక భూమిక పోషించారు.
అంతకు ముందు కూడా ఆమె దివ్యాంగుల కోసం పార్లమెంటులో రిజర్వేషన్ల పై పోరాడారు. అనేక సమస్యల పై అండగా నిలిచారు. అప్పటి నుంచి తమ అభిమాన నాయకురాలిగా దివ్యాంగులు తమ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. అయతే మంగళవారం ఈ మంజూరైన ట్రై సైకిళ్ల పంపిణీ ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో జరిగింది. ఆమె లేకున్న తమ గుండెల నిండా అభిమానాన్ని నింపుకున్న దివ్యాంగులు ఆమె చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ట్రై సైకిళ్ల పంపిణీ సమయంలో అర్వింద్, అర్వింద్ అనుచర బృందం సైకిల్ వెనుక ఉండే బ్యాటరీ పైన అర్వింద్ పేరుతో ఉన్న పెద్ద స్టిక్కర్‌ను అతకించారు. ఉచితంగా ప్రచారం నిర్వహించుకునే ఎత్తుగడలో భాగంగా ఈ పని చేశారు.
ఈ వ్యవహారం మరీ దిగజారుడు తనానికి నిదర్శనంగా ఉందనే విమర్శలు వినిపించాయి. అయితే కార్యక్రమం ముగిసిన గంటల వ్యవధిలోనే ఆ దివ్యాంగులు అర్వింద్ పేరున్న స్టిక్కర్‌ను తొలగించుకోవడం విశేషం. ఆ ట్రై సైకిలు తమకు దక్కడం వెనుక ఎవరి చొరవ, కృషి ఉందో పూర్తిగా తెలిసివున్న వారంతా చుట్టపు చూపుగా వచ్చిన అర్వింద్ పెత్తనాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్‌ను తమ సైకిళ్ల పై ఉంచుకోవడానికి ఏ మాత్రం వాళ్ల మనసు అంగీకరించలేదు. అభిమానం అనేది గుండె లోతుల్లోంచి రావాలే గాని బలవంతంగా రుద్దితే రాదని ఈ సంఘటన అర్థం పట్టింది.