తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడు జానారెడ్డి చాలా ప్రియమైన నాయకుడు అయిపోయారు. కొంతకాలంగా జానా కాంగ్రెస్‌లో చేరుతారన్న పుకార్లు షికార్ చేస్తూనే ఉన్నాయి. అయితే, వాటిపై ఇటు జానా కానీ టీఆర్ఎస్ నేతలు కాని స్పందించలేదు. అయితే తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్క్రతిక సారధి రసమయి బాలకిషన్ టీఆర్ఎస్‌లోకి జానా ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. త్వరలోనే జానా గులాబీ తీర్దం పుచ్చుకోనున్నారని తెలిపారు.
సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముదు కాంగ్రెస్‌లో నేతలెవరు మిగలరని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోస్యం చెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా త్వరలో కారుక్కుతారని తెలిపారు. కాంగ్రెస్ నేత జానరెడ్డి కూడా వలసలకు మినహాయింపు కాదని.. ఎన్నికలకు ముందే ఆయన కూడా కారెక్కుతారని అభిప్రాయపడ్డారు.
మంత్రి హరీష్ రావుకు నేను జీరాక్స్‌నని, ఆయన ఏం చేస్తే అది నేను ఫాలో అవుతానన్నారు. కానీ ఆయనకు ఇచ్చినంత ప్రచారం మీడియా నాకు ఇవ్వడం లేదని వాపోయారు. క్యాష్ లెస్ గ్రామాల్లో ఆయనే నాకు ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో అధికారులు ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని.. కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు.
వాస్తవానికి పరోక్షంగా జానారెడ్డి, అధికార పార్టీకి సహకరిస్తున్నారని బాహాటంగానే కాంగ్రెస్ నేతలు గతంలో అనేక సార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…టీఆర్ఎస్‌పై విమర్శలు చేసిన ప్రతిసారీ జానా….సొంతపార్టీ నేతలు చేసిన ఆరోపణలను ఖండిస్తారు. జానా ఇలా ఎందుకు మాట్లాడుతారోనన్న విషయం ఎవరికి అంతుపట్టడం లేదు. ఇటీవలె కాంగ్రెస్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి…అధికార పార్టీని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేయగా….జానా మాత్రం ఇందుకు భిన్నంగా తన స్వరం వినిపించారు.
గ్రేటర్ ఎన్నికలకు ముందుకు కాంగ్రెస్ శాసనసభా పక్ష కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న రూ. 5 భోజన పథకం బాగుందని జానారెడ్డి ప్రశంసించడమే దీనికి కారణం. అసలు ప్రత్యేకంగా జీహెచ్‌ఎంసీ భోజన కేంద్రం నుంచి పార్సిల్ తెప్పించడమే కాదు, దానిని తింటూ ఫొటోగ్రాఫర్లకు ఫోజులిచ్చి, ఆ భోజనం బాగుందని కూడా జానారెడ్డి కితాబిచ్చారు.
ఇక ఇటీవలె యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జానా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, సాగర్ కింద రెండో పంటకు నీరు అందిస్తామన్న హామీలను నెరవేరిస్తే టీఆర్ఎస్ కు ప్రచార సాధకుడిగా పని చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కృష్ణా పుష్కరాలలో పుష్కరస్నానం చేసిన జానా…ఏర్పాట్లను అభినందించారు. ఈ నేపథ్యంలో రసమయి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.