పన్నీర్‌కు విద్యుత్ స్తంభం – చిన్నమ్మకు టోపీ

238
Electricity pole for OPS, hat for Sasikala
- Advertisement -

అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు ‘రెండు ఆకుల’ను ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. పన్నీర్‌ సెల్వం వర్గానికీ, శశికళ వర్గానికీ కేటాయించకుండా నిలిపివేసింది. ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికలో అభ్యర్థులెవరైనా ‘స్వతంత్రులు’గానే, మరేదైనా గుర్తుతో పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో 37 ఏళ్ళ తరువాత అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం లేకుండానే ఎన్నికల బరిలోకి దిగనుంది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆర్‌కేనగర్‌కు ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే జయ మరణానంతరం రెండుగా విడిపోయిన అన్నాడీఎంకే నేతలు.. పార్టీ గుర్తు ‘రెండాకుల’ కోసం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. అయితే ఇరు వర్గాల వాదనలను విన్న ఈసీ.. రెండాకుల గుర్తును ఎవరికీ కేటాయించకుండా స్తంభింపజేస్తూ  నిర్ణయం తీసుకుంది. రెండు వర్గాల వారు కొత్త పార్టీ పేరును ప్రతిపాదించుకోవచ్చని ఈసీ పేర్కొంది. దీంతో పాటు గుర్తులను కూడా కోరింది. ఈ మేరకు శశికళ వర్గం, పన్నీర్‌ వర్గం తమ తమ పార్టీ పేర్లను ఈసీకి ప్రతిపాదించాయి.

పన్నీర్‌ సెల్వం వర్గం తమ పార్టీని ‘అన్నాడీఎంకే పురుచ్చి తలైవి అమ్మా’గా ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదించగా.. శశికళ వర్గం ‘అన్నాడీఎంకే అమ్మా’గా ప్రతిపాదించింది. శశికళ వర్గానికి టోపి గుర్తు, పన్నీర్‌సెల్వం వర్గానికి విద్యుత్‌ స్తంభం గుర్తును ఈసీ కేటాయించింది. అన్నాడీఎంకే పేరును ఎక్కడా వాడొద్దని ఇరువర్గాలకు ఈసీ సూచించింది.

ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో పన్నీర్ సెల్వం వర్గం తరఫున ఈ మధుసూదనన్, శశికళ వర్గం తరపున దినకరన్ పోటీ పడుతుండగా, జయ మేనకోడలు దీప, డీఎంకే అభ్యర్థి కూడా రంగంలోకి దిగుతుండటంతో ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా నిలిచింది.

- Advertisement -