ప్రత్యామ్నాయ పంటల బుక్ లెట్ల పంపిణీ..

100
crops
- Advertisement -

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ ఉండటమే కాకుండా, మార్కెట్ డిమాండ్ కూడా అధికంగా ఉండే అవకాశాలు రైతులకు లాభసాటిగా మారుతాయని అంటోంది. అందుకే వరికి బదులుగా రైతులు ఇతర పంటలపై దృష్టిపెట్టాలని సలహా ఇస్తోంది.

ఈసారి రాష్ట్రాన్ని వర్షాలు కాస్త ఆలస్యంగా పలకరించాయి. పోయిన ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వరిసాగు తగ్గింది. గత సంవత్సరం ఈ సమయానికి 22 వేల ఎకరాల్లో వరి నాట్లు పడితే, ఈ సంవత్సరం 9 వేల ఎకరాల్లో మాత్రమే రైతులు వరి నాట్లు వేశారు. ఐతే జనవరి వరకు వరినాట్ల ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఈలోపు ఇంకా వీలైనంతగా రైతుల్లో అవగాహన తెచ్చి వాళ్ళను ప్రత్యమ్నాయ పంటల వైపు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ధ్యేయం.

ఇక వర్షపాతం, నేల స్వభావం, వాతావరణంల ఆధారంగా తెలంగాణాను ఉత్తర, మధ్యస్థ, దక్షిణ జోన్లుగా వ్యవసాయశాఖ విభజించింది. మూడు చోట్ల వివిధ రకాల పంటలను సూచిస్తోంది. రైతులతో చిన్న చిన్న గ్రూపులు ఏర్పాటు చేసి వాళ్లతో అగ్రికల్చర్ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వాణిజ్య పంటల పట్ల వాళ్లలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవడానికి మెళకువలు చెబుతున్నారు. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో, నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ఇతర చోట్ల ఆయిల్ పామ్ సాగువైపు అధికారులు రైతులను ప్రోత్సాహిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలుగా పప్పు దినుసులు పండించాలని సలహా ఇస్తున్నారు.

చలి ఎక్కువగా ఉండే ఉత్తర తెలంగాణాలో ఆవాలు, నువ్వులు, శెనగలు, మినుములు, పెసర్లు పండించాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యస్థ తెలంగాణాలో ప్రధానంగా హైబ్రిడ్ వంగడాలతో మంచి దిగుబడికి ఆస్కారం ఉన్న జొన్నలపై ఫోకస్ చేస్తున్నారు. నల్లరేగడి ప్రాంతాలైన వరంగల్, మెదక్, ఆదిలాబాద్, సిద్దిపేట, బాసర లాంటి చోట్ల సొయాచిక్కుడు, పత్తి తరవాత జోన్నలు రెండవ పంటగా ఇప్పటికే సాగులో ఉంది. పశుగ్రాసం కోసం ఉపయోగించే చొప్ప కూడా కలిసిరావడంతో జొన్నలు పండించడానికి రైతులు సహజంగానే మొగ్గు చూపుతుంటారు. దీన్ని మరింత ప్రోత్సహించాలనేది ప్రభుత్వ వ్యూహం. ఇది కాక మధ్యస్థ తెలంగాణాలో శెనగలు, మినుములు, పెసర్లు, కాయగూరలు, మక్కలు, వాటర్ మిలన్ లాంటి ప్రత్యామ్నాయాలను సజెస్ట్ చేస్తున్నారు. ఇక నల్లరేగడి నేలలుండే దక్షిణ తెలంగాణాలో వేరుశెనగ, శెనగలు, కాయగూరలు, వాటర్ మిలన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులను అధికారులు కోరుతున్నారు. తద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్నారు.

ప్రత్యామ్నాయ పంటలు త్వరగా కూడా చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు పెసర్లు కేవలం 65 రోజుల్లో చేతికి అందుతాయి. అలాగే నువ్వులు 75 రోజుల్లో, శెనగలు 105 రోజుల్లో చేతికొస్తాయి. అలాగే ఎకరాకు వీటి దిగుబడి కూడా ఎక్కువగానే ఉంటుంది. నువ్వులు ఎకరాకు 4 క్వింటాల్స్, శెనగలు ఎకరాకు 15 క్వింటాల్స్ వరకు దిగుబడి ఉంటుంది. ఈ పంటలకు నీళ్లు తక్కువ అవసరం అవుతాయి. సేంద్రియ కర్బనం పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. తద్వారా ప్రత్యామ్నాయ పంటల వల్ల ఖర్చు తగ్గుతుంది. మార్కెట్లో అధిక డిమాండ్ ఉండి, ఎక్కువ ధరలు వచ్చి వ్యవసాయం లాభసాటి అవుతుంది అంటున్నారు అధికారులు.

ఇక నీళ్లు ఎక్కువగా అవసరం అయ్యే వరిసాగుకు 4 నెలల కాలం పడుతుంది. అధికసాగు కారణంగా మార్కెట్లో డిమాండ్ పడిపోతుంది. అటు కేంద్రం కూడా ధాన్యం సేకరణలో ఓ స్పష్టమైన విధానాన్ని అవలంభించడం లేదు. ఎన్నిసార్లు అడిగినా మద్దతు ధరను కూడా పెంచడం లేదు. ఈ కారణాలన్నీ కూడా వరిసాగు రైతులకు శాపంగా పరిణమించి నష్టాన్ని చేకూరుస్తాయి అనేది నిపుణుల అభిప్రాయం. అందుకే వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశం అయి ప్రత్యామ్నాయ పంటల గురించి వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున వ్యవసాయ శాఖ తయారుచేసిన ఆల్టర్నేట్ క్రాప్స్ బుక్ లెట్ ను అందిస్తున్నారు.

- Advertisement -