విదేశాల్లో మొదటి ప్రధాని విగ్రహం:మహేష్‌

495
- Advertisement -

విదేశాల్లో ఆవిష్కరించుకున్న భారతీయుల విగ్రహాల విషయానికి వస్తే.. మహాత్మా గాంధీ తరువాత ఆవిష్కరించిన రెండో భారతీయుడి విగ్రహం పీవీ నరసింహారావుదేనని మహేష్‌ బిగాల అన్నారు. భారత ప్రధానుల విషయానికి వస్తే.. విదేశాల్లో ఆవిష్కరించిన భారత ప్రధాని విగ్రహం పీవీ నరసింహారావుదే మొట్టమొదటిది కావడం గమనార్హం. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు విగ్రహాలను తయారుచేసే తెలుగు కళాకారుడైన ప్రసాద్ ఈ పీవీ విగ్రహాన్ని తయారు చేశారు. దీనిని మొట్టమొదట ఆస్ట్రేలియాలో ఆవిష్కరించాలని తలచిన ఉత్సవాల ఓవర్సీస్ కన్వీనర్ మహేష్ బిగాల స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిలర్ సంధ్యారెడ్డిని సంప్రదించారు.

తెలంగాణకు చెందిన మొట్టమొదటి కౌన్సిలర్ అయిన సంధ్యారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం ఎంపిక చేయడంలోనూ చొరవ చూపారు. మేయర్ మాథ్యూ బ్లాక్ మోర్ తో ఈయేడు మే 22న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్ట్రాత్ ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ -2020 కు ఎంపికైన సంధ్యారెడ్డి కౌన్సిల్లోనూ ఈ తీర్మాణానికి అంగీకారం తెలిపేలా చూశారు. అన్ని రకాల అనుమతులు వచ్చిన తరువాత పీవీ విగ్రహాన్ని ఆస్ట్రేలియాకు విమానంలో తరలించారు.

సిడ్నీలోని స్ట్రాత్ ఫీల్డ్ కౌన్సిల్ నుంచి పూర్తి సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. స్ట్రాత్ ఫీల్డ్ లో సుమారు 16 శాతం భారతీయులే నివసిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు, ఆదేశాలతో విదేశాల్లో మొట్టమొదటగా ఒక భారత ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని, అలాగే మరో ఐదు పీవీ విగ్రహాలను వేరే దేశాల్లో ఆవిష్కరించేలా ప్రణాళికను రూపొందించినట్టు ఓవర్సీస్ కమిటీ కన్వీనర్ మహేష్ బిగాల తెలిపారు.

- Advertisement -