కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఓ ఘటనలో, వ్యక్తి మరణానికి కారణమైందని ఆరోపణలతో ఓ మహిళపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కోజికోడ్ జిల్లాకు చెందిన దీపక్ అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో, ఒక మహిళ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ తాకాడని ఆరోపిస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో కొద్ది సమయంలోనే వైరల్‌గా మారడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
వీడియో వైరల్ కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన దీపక్, అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కుటుంబ సభ్యులు, సన్నిహితులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. దీపక్ మృతిపై విచారణ చేపట్టిన పోలీసులు, ఈ వ్యవహారంలో కీలకంగా మారిన సోషల్ మీడియా వీడియో అంశాన్ని పరిశీలించారు.
దర్యాప్తు అనంతరం, దీపక్‌ను ఆత్మహత్యకు పురిగొల్పినట్టుగా భావిస్తూ సంబంధిత మహిళపై కోజికోడ్ మెడికల్ కాలేజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయస్మృతి ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించడంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో బాధ్యతాయుత ప్రవర్తన, ఆరోపణల విషయంలో జాగ్రత్త అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read:కివీస్ టీమ్‌పై రహానే ప్రశంసలు

