ఫోన్ ట్యాపింగ్ అంశంపై తెలంగాణ రాజకీయాల్లో వాగ్వాదం మరింత తీవ్రమవుతోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “రేవంత్ రెడ్డి ఇంకెన్ని రోజులు లీకుల మీద బతుకుతావు? ఫోన్ ట్యాపింగ్ జరిగింది, తప్పు జరిగింది అంటున్నావు. మరి ఒక్క అధికారి కూడా బయటికి వచ్చి అధికారికంగా ఎందుకు మాట్లాడడం లేదు?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి వైఖరిని విమర్శిస్తూ, “తాను చెడ్డ కోతి అయితే వనమంతా చెడిపోయిందన్నట్లు ఆయన ప్రవర్తన ఉంది” అని వ్యాఖ్యానించారు. గతంలో రేవంత్ రెడ్డి దొంగ పనులు చేస్తూ డబ్బు సంచులతో దొరికిన ఘటనలను గుర్తుచేస్తూ, అందరూ అలానే ఉంటారని ఆయన భావిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
“కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ గ్రేస్. ఒక మంత్రి 20 శాతం, ఇంకో మంత్రి బ్యాగ్‌మ్యాన్‌లా వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి డబ్బుల సంచులు పంపించినట్లే ఉన్నారు, అందుకే భట్టి విక్రమార్క మౌనంగా ఉన్నారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా అధికారికంగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా, కేవలం లీకుల ఆధారంగా ఎంతకాలం రాజకీయాలు చేస్తారని విమర్శించారు. గతంలో హరీష్ రావుపై నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తుచేస్తూ, అయినా కుట్రతో ఆయనను జైలుకు పంపించాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం వాదనలు చేసిందని ఆరోపించారు.
సింగరేణి అంశంలో సీఎం బావమరిది సృజన్ రెడ్డి కేంద్రంగా టెండర్ల రిగ్గింగ్ జరిగిందని, ఇప్పటివరకు తొమ్మిది టెండర్లపై ముఖ్యమంత్రి కుటుంబం నియంత్రణ ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. గతంలో లేని విధంగా అంచనా విలువకన్నా ఎక్కువకు టెండర్లు వేయించారని, సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన పెట్టి కంపెనీలను బెదిరింపులకు గురి చేశారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించకపోవడంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రం–రాష్ట్రం భాగస్వామ్యంగా ఉన్న సింగరేణికి నష్టం జరుగుతున్నా మౌనం ఎందుకని విమర్శించారు. నైనీ గనులతో పాటు మిగిలిన కాంట్రాక్టులను రద్దు చేస్తారా లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు.
ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని, గతంలో అమృత్ టెండర్లు, రేషన్ బియ్యం స్కాం, మూసీ అంశాల్లోనూ ఇదే జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని సిట్‌లు వేసినా భయపడేది లేదని, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. మరో రెండు సంవత్సరాల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని, అధికార దుర్వినియోగం చేసిన వారంతా భవిష్యత్తులో బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని వాళ్లే ఒకరినొకరు బయటపెట్టుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారని ఆమె విమర్శించారు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజాయతీ ఉంటే, ఈ బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.