ఫిఫాలో గర్జించిన రష్యా

260
russia
- Advertisement -

రష్యాలో అట్టహాసంగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య రష్యా శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో రష్యా 5-0 గోల్స్ తేడాతో సౌదీ అరేబియాపై ఘన విజయం సాధించింది. ప్రారంభం నుంచే రష్యా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అసాధారణ ఆటతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. దూకుడైన ఆటతో ప్రకంపనలు సృష్టించింది. గ్రూప్‌ ఎలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో రష్యా హవా కొనసాగింది. రష్యా దూకుడును ఏ దశలోనూ సౌది అరేబియా అడ్డుకోలేకపోయింది. కనీసం రష్యాకు సౌదీ అరేబియా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.  ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే రష్యా మొదటి గోల్ సాధించింది. 12వ నిమిషంలో యూరి గాజిన్‌స్కి తొలి గోల్ చేశాడు. తర్వాత కూడా రష్యా గోల్స్ కోసం ప్రత్యర్థి గోల్డ్ పోస్ట్‌వైపు వరుస దాడులు చేసింది. మరో రెండు నిమిషాల్లో ప్రథమార్ధం ముగుస్తుందనగా రష్యాకు రెండో గోల్ దక్కింది. డెనిస్ చెరిషేవ్ ఈ గోల్ చేశాడు.

Luzhniki-Stadium

దీంతో మొదటి హాఫ్‌లో రష్యా 2-0 ఆధిక్యాన్ని అందుకుంది. ద్వితీయార్ధంలో కూడా రష్యాకు ఎదురు లేకుండా పోయింది. అటాకింగ్ గేమ్‌తో సౌదీని హడలెత్తించింది.  71వ నిమిషంలో అర్టెమ్ రష్యాకు మూడో గోల్ సాధించి పెట్టాడు. తర్వాత కూడా మరో రెండు గోల్స్ చేయడంతో 5-0తో భారీ విజయాన్ని అందుకుంది. ఎంజ్యూరి టైమ్‌లో డెనిస్, అలెగ్జాండర్ గొలొవిన్‌లు ఈ గోల్స్ సాధించారు. డెనిస్‌కు ఇది రెండో గోల్ కావడం విశేషం.

Luzhniki-Stadium

అంతకు ముందు మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో గురువారం ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ ప్రారంభ కార్యక్రమాలు అట్టహాసంగా సాగాయి. మ్యాచ్‌ అధికారిక బంతిని మోడల్‌ విక్టోరియా లొపిరెవా జనంతో కిక్కిరిసిన స్టేడియంలోకి తీసుకురాగా,  స్పెయిన్‌ మాజీ గోల్‌కీపర్‌ ఐకర్‌కాసిల్లాస్‌ ప్రపంచ కప్‌ ట్రోఫీని ఆవిష్కరించాడు. మాస్కో నగరంలోని లుజినికీ స్టేడియంలో జరిగిన ఆరంభ కార్యక్రమాలలో రష్యా సంప్రదాయాలను గుర్తుచేసేలా సెట్టింగులతో 500మంది కళాకారుల ప్రదర్శన ఆహుతులను అలరించింది. రష్యా గాయని ఐదా గారిఫులీనా, ఇంగ్లండ్ సంగీతదర్శకుడు రాడియన్ విలియమ్స్ కలిసి ఆడిపాడి ప్రేక్షకుల్లో జోష్‌పెంచారు. వెరైటీ డ్రెసింగ్స్‌తో స్టేడియంలో అద్భుత ప్రపంచాన్ని కళాకారులు ఆవిష్కరించారు.

- Advertisement -