ఫిడెల్ కాస్ట్రో.. ఈ పేరు వింటే ఒక ఉప్పొంగే సముద్రం గుర్తుకు వస్తుంది. విరుచుకుపడే ఉద్యమ కెరటం స్ఫురణకు వస్తుంది. క్యూబా విప్లవనాయకుడు, బాటిస్టాను గద్దె దింపి.. క్యూబాను ఒకే పార్టీ కమ్యూనిస్టు దేశంగా అర్థ శతాబ్దం పాటు నడిపించిన కాస్ట్రో(90) ఇక లేరు. కొద్దికాలం నుండి ఆనానోగ్యంతో బాధపడుతున్న కాస్ట్రో శనివారం కన్నుమూశారు. 1926 ఆగస్టు 13న బిరాన్‌లోని హోల్గిన్‌లో జన్మించిన ఆయన క్యూబా అధ్యక్షునిగా విశిష్ట సేవలందించారు. 1976 నుంచి 2008 వరకు క్యూబా అధ్యక్షునిగా పనిచేశారు. తుది శ్వాస విడిచే వరకూ కమ్యూనిస్టు సిద్ధాంతాల పరిరక్షణ కోసం కృషి చేశారు.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా దిగ్గజం ఫిడెల్ క్యాస్ట్రో తల్లిదండ్రుల పేర్లు గలీసియా, ఏంజెల్ క్యాస్ట్రో అర్జీజ్. ఫిడెల్ పూర్తి పేరు ఫిడెల్ అలెజాండ్రో క్యాస్ట్రో. మార్క్సిస్టు- లెనినిస్టు భావాలకుతోడు క్యూబన్ జాతీయతను కలగలపి ఫిడెల్ స్థాపించిన క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ.. నాటి అమెరికా అనుకూల బటిస్టా ప్రభుత్వాన్ని విప్లవోద్యమం ద్వారా కూల్చివేసి, దేశాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.
కమ్యూనిస్టు క్యూబా ఆదర్శాలు ఈ భూమి మీద ఎప్పటికీ నిలిచే ఉంటాయని, నిరంతర మానవ పోరాటంలో సామాజిక, సాంస్కృతిక విజయాలు తప్పక సిద్ధిస్తాయనడానికి క్యూబా ఒక రుజువుగా కొనసాగుతుందని కాస్ట్రో చివరిసారిగా చేసిన తన ప్రసంగంలో పేర్కోన్నారు. విదేశీ పెట్టుబడులకు, ప్రైవేటీకరణకు ఇప్పుడిప్పుడే ద్వారాలు తెరుస్తున్న ఈ ద్వీప దేశంలో… 90 ఏళ్ళ ఫిడెల్ కాస్ట్రో స్వరం ఇప్పటికీ ఓ విద్యుత్ తరంగంలా ప్రసరిస్తూ ఉండడం విశేషం.
త్వరలోనే చనిపోతా…
తనకు అంతిమ గడియలు సమీపించాయని, త్వరలోనే తాను చనిపోతానని కమ్యూనిస్టు పార్టీని ఉద్దేశించి చేసిన వీడ్కోలు ప్రసంగంలో ఫిడెల్ క్యాస్ట్రో సంచనల వ్యాఖ్యలు చేశారు.త్వరలో తనకు 90 ఏళ్లు వస్తాయని, అందరికీ అంతిమ సమయం ఆసన్నమౌవుతుందని, తనకూ అంతేనని ఆయన పేర్కొన్నారు. క్యూబా కమ్యూనిస్టుల భావాలు చరిత్రలో నిలిచిపోతాయని, చిత్తశుద్ధితో పోరాడితే ప్రజల అవసరాలు తీర్చగలవనేందుకు రుజువులుగా ఉంటాయని, దీని కోసం అలుపెరగకుండా పోరాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తన చావుపై మాట్లాడే విషయంలో ఎటువంటి నిషేధం లేదని ఆయన పేర్కొన్నారు. ఇదే తన ఆఖరి సందేశం కావొచ్చని తెలిపారు.