దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే మూడు దశల ఎన్నికల ప్రక్రియ పూర్తవగా మరో నాలుగుదశల ఎన్నికల సంగ్రామం మాత్రమే మిగిలిఉంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో అన్న సందేహం అందరిలో నెలకొంది. బీజేపీ,కాంగ్రెస్‌కి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకం కానుంది.
దీంతో మరోసారి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. త్వరలోనే రాష్ట్రాల్లో పర్యటించి వివిధ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలు ఖరారైనట్లు తెలుస్తోంది.
బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటు దిశగా వివిధ పార్టీల అధినేతలతో భేటీ కానున్నారు. ముందుగా లోక్‌సభ ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో పర్యటించాలని కేసీఆర్ నిర్ణయించారు.మే 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈలోనే సుడిగాలి పర్యటన చేయనున్నారు గులాబీ బాస్.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ పలు పార్టీల అధినేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ఆవిర్భావం గురించి వివరించి సానుకూల ఫలితాన్ని రాబట్టారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా దేశంలోని సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చో ఉదహరణలతో వివరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫెడరల్ టూర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.