సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్రబెల్లి చిత్ర‌ప‌టాలకు పాలాభిషేకం..

208
kcr
- Advertisement -

తెలంగాణ‌కు ముందు… సుక్క నీటి కోసం నోళ్ళు తెర‌చిన బీళ్ళు… భూత‌ల్లికి క‌న్నాలు వేసి, పాతాళానికి తొవ్విన బోర్లు…వాన‌లు రాక బావులు ఎండి బావురుమ‌న్న రైతులు… తెలంగాణ వ‌చ్చాక… కాళేశ్వ‌రం, దేవాదుల, ఎస్సారెస్పీ కాలువ‌ల‌తో సొక్క నీరు… భూమ‌ట్టం పెరిగి, వేయ‌కుండానే పొంగిపొర్లుతున్న బోర్లు… వ‌ద్దంటే వస్తున్న వ‌ర్షాలు… రైతుల మోముల్లో హ‌ర్షాతిరేకాలు… నిజ‌మే, ఇలాంటి స‌న్నివేశాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆవిష్కృత‌మ‌వుతున్న‌వి. తాజాగా, రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామంలో ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది.

తెలంగాణ వ‌చ్చిన మొన్న‌టి దాకా…ఆ ఊరు ప‌రిస్థితి గ‌త కాలపుదే. కానీ, తాజాగా ఆ ఊరికి గోదావ‌రి నీళ్ళు వ‌స్తున్నాయి. కాలువ‌ల‌తో వ‌స్తున్న నీటితో సిఎం కెసిఆర్ ఆశీర్వాదంతో, మంత్రి ఎర్ర‌బెల్లి చొర‌వ తీసుకుని ఆ ఊరు ఊర చెరువుని నింపారు. గ‌త ఎండా కాలం స‌హా, ఇప్ప‌టికే రెండు మూడుసార్లు ఆ చెరువుని నీటితో నింపారు. దీంతో భూ గ‌ర్భ జ‌లాలు బాగా పెరిగాయి. మ‌రోవైపు వ‌ర్షాకాలం కావ‌డంతో తాజాగా ఆ చెరువు నిండు కుండ‌లా మారింది. ఈ మ‌ధ్య‌ విప‌రీతంగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో బోర్లు కూడా నిండిపోయాయి. బోర్ల నుండి నీటి ఊట‌ వాటంత‌టదే పైకి ఉబికి వ‌స్తున్నది. దీంతో ఆ చెరువు కింద సాగు చేస్తున్న రైతాంగం హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేశాయి.

ఈ సంద‌ర్భంగా పెద్ద‌వంగ‌ర‌కు చెందిన రైతులు రాసాల వెంక‌ట సోములు, గిర‌గాని వంశీ, ఒరిగంటి ప్ర‌శాంత్ త‌దిత‌రులు సీఎం కేసీఆర్‌, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుల చిత్ర‌ప‌టాల‌ను ఆ బోరు ద‌గ్గ‌రే పెట్టి, పాలాభిషేకం చేసి త‌మ ఆనందాన్ని పంచుకున్నారు. అప‌ర భ‌గీర‌థుని సీఎం కేసీఆర్‌ చేసిన ప్ర‌య‌త్నాలు కాళేశ్వ‌రం, దేవాదుల‌, ఎస్సారెస్పీ కాలువ‌ల రూపంలో చెరువులు నిండి క‌నిపిస్తుంటే, మంత్రి ఎర్ర‌బెల్లి సీఎం కి న‌మ్మిన బంటులా, జ‌నం త‌ల‌లో నాలుక‌లా… ఆ నీటితో చెరువులు నింపారు. దీంతో వ‌రుణుడు కూడా క‌రుణించి భారీ వ‌ర్షాలు కురిపించారు. ఈ కార‌ణంగా పాతాళ గంగ పైకి ఉబికి వస్తుండ‌టంతో రైతాంగం మాత్రం హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -