వర్ష ప్రభావిత కాలనీలను పరిశీలించిన మంత్రి కేటీఆర్‌..

226
ktr

వర్ష ప్రభావిత కాలనీలను మూడోరోజు  పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పరిశీలించారు. ఉదయం  ఖైరతాబాద్ లోని బిఎస్ మక్త కాలనీలో జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన షెల్టర్ హోమ్ ని పరిశీలించి, అక్కడ అందిస్తున్న సౌకర్యాల పైన ఆర మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ మరియు ఇతర ఉన్నతాధికారులు మంత్రి వెంట ఉన్నారు. వరద వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలకి రేషన్ కిట్ లతోపాటు ఇతర అన్ని సౌకర్యాలను అందించేందుకు జిహెచ్ఎంసి ప్రయత్నం చేస్తుందనీ తెలిపారు.  ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కాలనీలు వరద నుంచి తెరుకుంటున్న నేపథ్యంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తామని  తెలిపిన కేటీఆర్ ప్రజలంతా ఖచ్చితంగా తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలనీ, కాచివడపోసిన నీటిని తాగాలన్నారు.

వరద ప్రభావిత కాలనీలలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని, ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.  ప్రస్తుతం షెల్టర్ హోమ్‌లలో ఉన్న వారందరికీ ఇప్పటికే ఆహారంతోపాటు దుప్పట్లు, మందులు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బిఎస్ మక్తలో ఏర్పాటుచేసిన షెల్టర్ హోమ్, వైద్య శిబిరాన్ని, అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. షెల్టర్ హోమ్‌లో ప్రస్తుతం బసచేసిన ప్రజలతో మంత్రి మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. ఇళ్లలో నుంచి పూర్తిగా నీళ్లు తగ్గేవరకు షెల్టర్ హోంలో ఉండవచ్చని, ఇందుకోసం అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. షెల్టర్ హోమ్ నుంచి ఇళ్లకు వెళ్లిన తర్వాత పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో అవసరమైతే జిహెచ్ఎంసి సహాయం తీసుకోవాలని సూచించారు.

తరువాత బేగంపేట, ప్రకాష్ నగర్ లో పర్యటించి నీటమునిగిన కాలనీలను పరిశీలించిన మంత్రి కేటీఆర్, నగరంలో కురిసిన వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిస్తున్న రేషన్ కిట్లను పలువురికి అందించారు. బేగంపేటలో ప్రకాష్ నగర్, బ్రాహ్మణ వాడి ప్రాంతాలను పరిశీలించిన అనంతరం అక్కడ ముంపుకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులకు మంత్రి కేటీఆర్ రేషన్ కిట్లను అందించారు. ఆ తర్వాత మల్కాజ్గిరిలోని పటేల్ నగర్ కి చేరుకున్న మంత్రి కేటీఆర్ అక్కడ ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మంత్రి కేటీఆర్ కి ముంపుకు గురైన ప్రాంతాలను చూపించారు.

గత మూడు రోజులుగా ఆయా కాలనీల్లో అందిస్తున్న సహాయక చర్యల గురించి వివరాలు అందజేశారు. పటేల్ నగర్ వద్ద ఉన్న నాలను పరిశీలించిన మంత్రి, భవిష్యత్తులో వరద రాకుండా చేపట్టాల్సిన రిటైనింగ్ వాల్ వంటి నిర్మాణాలకు సంబంధించి అంచనాలు సిద్ధం చేసి వెంటనే అనుమతులు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల వల్ల తమ ఇల్లు కోల్పోయిన లేదా నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అక్కడి వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు తమ నెలల గౌరవ వేతనాన్ని సిఎంఆర్ఎఫ్ కి అందించారు.

హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం తామ ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాలని హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ నెంబర్ లు నిర్ణయించారు. వీరితో పాటు తమకు వచ్చే నాలుగు నెలల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి అందించనున్నట్లు కంటోన్మెంట్ బోర్డు సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఒక లేఖను పురపాలక శాఖ మంత్రి  కె తారకరామారావుకు అందించారు.