కాళేశ్వరం సాగునీరు అందక తమ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణలో ఒక మహిళా రైతు చేసిన నిరసన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కక్కెర్ల లక్ష్మి అనే మహిళా రైతు తన పొలంలోనే వినూత్నంగా ఫ్లెక్సీ బ్యానర్ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై నిరసన తెలిపారు.
మహిళా రైతు లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. తనకున్న 2 ఎకరాల 30 గుంటల భూమిలో అప్పులు చేసి పత్తి పంటను సాగు చేశారు. అయితే వర్షభావ పరిస్థితులు ఏర్పడటం, దానికితోడు సాగునీటి కాలువలోకి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయకపోవడంతో పొలంలో పంట పూర్తిగా ఎండిపోయిందని ఆమె వాపోయారు. “మా భూముల పక్కనే కాకతీయ 38 DBM కాలువ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి కాలువకు కాళేశ్వరం జలాలను మళ్లించి ఉంటే చెరువులు నిండి, బావుల్లో భూగర్భ జలాలు పెరిగేవి.
తద్వారా మా పంటలు దక్కేవి. ఇప్పుడు పంట ఎండిపోయి అప్పులు కూడా తీర్చలేని దుస్థితిలోకి నెట్టివేయబడ్డాం” అని లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న ఫ్లెక్సీ వీడియో “రేవంత్ అన్నా.. ఇప్పటికైనా కళ్లు తెరవండి, రైతులను ఆదుకోండి” అంటూ పొలంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ఆమె ఆవేదన వ్యక్తం చేసిన దృశ్యాలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాగునీరు సరిగ్గా అందక పంటలు దెబ్బతింటున్నాయని, వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన తమలాంటి రైతులకు ఎకరానికి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
Also Read:అమెరికాకు లొంగిపోయిన మోదీ!

