ఫేక్ ‘ఈ-పాన్’..ఈమెయిళ్లపై అలెర్ట్!

1
- Advertisement -

ఆర్థిక సేవలు వేగంగా డిజిటలైజ్ అవుతున్న నేపథ్యంలో ప్రజలు ముఖ్యమైన పత్రాలు మరియు అప్‌డేట్‌ల కోసం ఈమెయిళ్లు, డిజిటల్ మెసేజ్‌లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే దీంతో పాటే డిజిటల్ కమ్యూనికేషన్ ముసుగులో వినియోగదారులను మోసం చేసే నకిలీ మెసేజ్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఈ-పాన్ (e-PAN) కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ వస్తున్న ఒక ఈమెయిల్ నకిలీదని అధికారులు తెలిపారు.

PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ఈమెయిల్‌ను నకిలీదిగా గుర్తించి..ఇది ఆదాయపు పన్ను శాఖ నుంచి వచ్చిన అధికారిక సమాచారం కాదని స్పష్టం చేసింది. ‘X’ (ట్విట్టర్) వేదికగా పిఐబి ఫ్యాక్ట్ చెక్ పోస్ట్ చేస్తూ.. మీకు కూడా ఈ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతూ ఈమెయిల్ వచ్చిందా? అయితే జాగ్రత్త, ఈ ఈమెయిల్ నకిలీది అని పేర్కొంది.

ఆర్థిక వివరాలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని కోరే ఈమెయిళ్లు, లింక్‌లు, ఫోన్ కాల్స్ లేదా ఎస్‌ఎంఎస్‌లకు స్పందించవద్దని ప్రజలను హెచ్చరించింది. ఇలాంటి విజ్ఞప్తులను అస్సలు నమ్మవద్దని, ఇటువంటి ఫిషింగ్ ఈమెయిళ్ల గురించి ఫిర్యాదు చేయడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్‌ను ఉపయోగించాలని సూచించింది.

ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం…ఆదాయపు పన్ను శాఖ ఈమెయిల్ ద్వారా ఎలాంటి వివరాలనూ లేదా వ్యక్తిగత సమాచారాన్ని కోరదు.బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డులు లేదా ఇతర ఆర్థిక ఖాతాలకు సంబంధించిన పిన్ (PIN) నంబర్లు, పాస్‌వర్డ్‌లను పంచుకోవాలని పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ ఎలాంటి ఈమెయిళ్లను పంపదు. ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చే నకిలీ ఈమెయిళ్లు లేదా వెబ్‌సైట్‌లను గుర్తించిన పన్ను చెల్లింపుదారులు, ఆ ఈమెయిల్‌ను లేదా వెబ్‌సైట్ URL ని webmanager@incometax.gov.in కి ఫార్వర్డ్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.

Also Read:ఇరాన్‌తో చర్చల ప్రసక్తే లేదు:ట్రంప్

డిజిటల్ మోసాలు పెరుగుతున్న తరుణంలో, ఆదాయపు పన్ను సేవలకు సంబంధించిన ఈమెయిళ్ల ప్రామాణికతను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా ఉండటానికి, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయడం లేదా వ్యక్తిగత సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తులతో పంచుకోవడం పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.

- Advertisement -