మహారాష్ట్రలో కరోనా వ్యాప్తిపై కేంద్రం ఆందోళన..

244
VK Paul
- Advertisement -

మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో మహారాష్ట్రలో కొత్త కేసులు మళ్లీ పెరుగుతుండటంపై కేంద్రం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ఈ రోజు మహారాష్ట్రలో 13,659 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇది 60 శాతం కావడం గమనార్హం. దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న 10 నగరాల్లో 8 మహారాష్ట్రలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. పూణె, నాగ్ పూర్, థానే, ముంబై, అమరావతి, జల్ గావ్, నాశిక్, ఔరంగాబాద్ నగరాలు వాటిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని జిల్లాల్లో లాక్ డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదని చెప్పారు.

మరోవైపు నాగపూర్‌లో కరోనా పరిస్థితిని సమీక్షించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర గురించి చాలా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. కరోనా కేసుల పెరుగుదల చాలా తీవ్రమైన విషయమని చెప్పారు. వైరస్‌ను తేలికగా తీసుకోవడమే దీనికి కారణమని అన్నారు. దేశం కరోనా రహితంగా ఉండాలంటే వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవడంతోపాటు కరోనా నియంత్రణ మార్గదర్శకాలను తప్పక పాటించాలని అన్నారు. తాజాగా పెరుగుతున్న కరోనా కేసుల నుంచి ఈ రెండు పాఠాలు మనం గ్రహించాలని చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

- Advertisement -