మల్లు స్వరాజ్యం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి- మంత్రి

48
- Advertisement -

స్వాతంత్ర్య, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్థివ దేహాన్ని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సీపీఎం కార్యాలయం మాకినేని బసవ పున్నయ్య భవనంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మల్లు స్వరాజ్యం పార్థివ దేహాన్ని సందర్శించి, పుష్ప గుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె ఆత్మ కు శాంతి చేకూరాలని మంత్రి ప్రార్థించారు.మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. తమ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నిజాం సర్కారును ఎదిరించారు. తూటా లా పేలే తన మాటను పాటగా మార్చి అనేక మంది ప్రజలను, ప్రత్యేకించి మహిళలను చైతన్య పరిచారు. నాడు అదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పని చేశారు. ప్రత్యేకించి పాలకుర్తిలో చాకలి ఐలమ్మ, దేవులపల్లి వెంకటేశ్వరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తన సోదరుడు భీం రెడ్డి నరసింహ రెడ్డి వంటి ఉద్ధండులతో కలిసి ఆమె పని చేశారు. ఆమె నడయాడిన నేల పాలకుర్తి ప్రాంతం ఇప్పటికీ చైతన్యం గల ప్రాంతం. మల్లు స్వరాజ్యం బతికి ఉన్నన్ని రోజులు పాలకుర్తికి పలు సందర్భాల్లో వస్తూ ఉండేవారు.

వారికి, పాలకుర్తి ప్రాంతానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె జీవితం మహిళా లోకానికి, ఉద్యమాలకు ఆదర్శం. తెలంగాణ ఉద్యమానికి అమే స్ఫూర్తి. మల్లు స్వరాజ్యం జీవిత చరిత్ర ను భవిష్యత్ తరాలకు అందించటానికి నా వంతు సహకారం అందిస్తాను.ఆమె లేని లోటు తీర్చలేనిది. మల్లు స్వరాజ్యం గారికి మరోసారి ఘన నివాళి అని మంత్రి తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంట సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -