మిషన్ భగీరథ దేశంలోనే నెం.1- మంత్రి ఎర్రబెల్లి

254
Minister Errabelli Dayakar
- Advertisement -

వరంగల్ మహా నగర పరిధిలోని, హాసన్ పర్తి- భిమారంలో మిషన్ భగీరథ మానిటరింగ్ సెల్ కార్యాలయాన్ని ఈరోజు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి కార్యాలయాన్ని పరిశీలించారు. మిషన్ భగీరథ మంచినీటినే తాగాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండ ప్రకాష్, స్థానిక ఎమ్మెల్యే అరురి రమేష్, స్థానిక ప్రజాప్రతనిధులు, అధికారులతో కలిసి మిషన్ భగీరథ మంచి నీటిని తాగారు మంత్రి ఎర్రబెల్లి. అనంతరం ధర్మసాగర్ లోని నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించి, పరిశీలించారు.మిషన్ భగీరథ పనుల తీరుని అధికారులతో సమీక్షించారు. అలాగే మిషన్ భగీరథ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించారు మంత్రి ఎర్రబెల్లి.

సమీక్ష అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. స్వచ్ఛమైన, శుభ్రమైన, శుద్ధి చేసిన ఆరోగ్య వంతమైన మంచినీటిని తెలంగాణ ప్రజలకు అందరికీ అందించాలనే లక్ష్యంతో సీఎం కేసిఆర్ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించారు. 46 వేల కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టి, 34 కోట్లు ఖర్చు చేసి 99 శాతం గ్రామాలకు మంచినీటిని కేవలం రెండేళ్లలోనే అందిస్తున్న అద్భుతమైన పథకమని మంత్రి తెలిపారు. 8, 123 కోట్ల ఆదా చేసిన ఘనత కూడా మనదే. 30 ఎండ్ల కింద సింగూరు నీటిని సిద్దిపేట అందించిన సీఎం కేసిఆర్ అనుభవంతో ఈ పథకాన్ని రాష్ట్రానికి విస్తరించి అమలు చేస్తున్నామన్నారు. రెండేండ్ల కింద ప్రధాని మోడీ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు.

నీరు అందే అవకాశాలు లేని ఐసోలే టెడ్ 126 గ్రామాలకు కూడా నీటిని అందించనున్నం. మిషన్ భగీరథ వల్ల నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ దాదాపు తగ్గిపోయింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ప్రతి రోజూ, ప్రతి పౌరుడికి, జీపీ లలో 100 లీ. మున్సిపాలిటీలో 135 లీ. కార్పొరేషన్‌లో 150 లీ. నీరు అందిస్తున్నాం. ధర్మసాగర్ నీటి శుద్ధి కేంద్రం ద్వారా వర్ధన్నపేట నియోజకవర్గంలోని 267 గ్రామాలు, స్టేషన్ ఘనపూర్ మండలంలో 7 మండలాలు మంచినీటి పొందుతున్నాయని మంత్రి తెలిపారు.

వరంగల్ మహా నగరంలో 47.50 మిలియన్ లీటర్ల శుద్ధి చేసిన నీటిని, 117 మి.లీ. శుద్ధి చేయని నీటిని అందిస్తున్నాం. వరంగల్ మహా నగర కార్పొరేషన్ లో ప్రస్తుతం రోజు విడిచి రోజు వస్తున్న నీటిని వచ్చే ఫిబ్రవరి నుంచి ప్రతీ రోజూ నీటిని అందించాలని భావిస్తున్నాం. మార్చి తర్వాత వరంగల్ మహా నగరానికి 24 గంటల పాటు నీరు అందించాలని ఆలోచిస్తున్నమని మంత్రి తెలిపారు. ఇతరత్రా వెయ్యి కోట్లు ఖర్చు చేస్తూ, అభివృద్ధి చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసిఆర్ దే. మన మిషన్ భగీరథ పథకం దేశంలోనే నెంబర్ వన్. మన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకంగా చేపట్టింది.మనం అడిగినా, సీఎం కోరినా, మన ఎంపీలు పార్లమెంట్ లో డిమాండ్ చేసినా, చివరకు నీతి ఆయోగ్, 15వ ఆర్థిక సంఘం చెప్పినా, కేంద్రం, నయా పైసా మనకు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు.

గుజరాత్ లో 10 ఎండ్ల కింద ప్రారంభించినా, ఇంకా 80 శాతం పనులు పూర్తి కాలేదు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా 883కోట్లు కేటాయించింది. ఉత్తర ప్రదేశ్ లో 5.78 శాతం మాత్రమే జరిగిన పనులకు 2,250 కోట్లు కేటాయించారు. కేంద్రం మన రాష్ట్రంపై ఇంతగా వివక్ష చూపడం అన్యాయమన్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా అనేక అంశాల్లో ఇదే పరిస్థితి ఉంది. అనేక అవార్డులు, అభినందనలు తెలుపుతూ, అన్యాయంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. అయినా, సీఎం కేసిఆర్, మంత్రి కేటీఆర్ లు మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, తెలంగాణ ప్రజల యోగ క్షేమాలు కోరి, మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -