తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు ప్రగతి పథంలో నిలిచి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పంచాయతీలకు ప్రధాని నరేంద్రమోధీ పురస్కారాలు అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 12 జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోధీ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. కేంద్రం పురస్కారాలిస్తుంది కానీ… నిధుల్లో కోత పెడుతోందన్నారు. ప్రతిభ చాటినందుకు, పనులు బాగా చేసినందుకు పూర్తి నిధులివ్వాలని, అదనంగా ఇస్తే ఇంకా సంతోషమని తెలిపారు.
గ్రామాలు దేశ వికాసానికి పట్టుగొమ్మలని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. గ్రామాల్లో కరోనా ప్రభలకుండా కట్టడి చేసి, కరోనా విముక్తి గ్రామాలుగా మారాలన్నదే మా ప్రభుత్వ ద్యేయమని అన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా గంగదేవిపల్లి ఉండేదని.. సియం కేసిఆర్ ఆలోచనలతో రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రంలోని అనేక గ్రామ పంచాయితీలు ఆదర్శంగా నిలిచి అభివృద్ధిలో పోటీపడుతున్నాయని ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చేవిధంగా కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త వార్డులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణాలో 8,690 గ్రామ పంచాయతీలుంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 12,769 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, పల్లెల అభివృద్ధికి ప్రతినెలా 308 కోట్లు విడుదల చేస్తూ.. ఇప్పటి వరకు 5,761 కోట్లు విడుదల చేసిన్నట్లు చెప్పారు. దేశంలో ఈ తరహ ఏ రాష్ట్రం నిధులను గ్రామ పంచాయతీలకు అందించడంలేదని అన్నారు.
15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధులలో.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి 699 కోట్లు కోత విధించిందని మంత్రి తెలిపారు. కేంద్రం కోతలు విధించినా.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎలాంటి కోతలు లేకుండా నిధులను అందిస్తుందన్నారు. తొలిసారిగా ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ నుండి మండల పరిషత్‌లకు, జిల్లా పరిషత్‌లకు 500 కోట్ల నిధులు కేటాయించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.మిషన్ భగీరథ పథకం కింద వంద శాతం గ్రామాలకు సురక్షితమైన త్రాగునీరు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కేంద్ర ప్రభుత్వ జల్‌శక్తి మిషన్ ప్రకటించడం మన ముఖ్యమంత్రి కేసిఆర్ గారి కృషికి దక్కిన ప్రశంసమని మంత్రి అన్నారు. ఈ పథకం క్రింద గత ఆరున్నరేళ్ల కాలంలో 32,500 కోట్ల రూపాయల వ్యయం చేసి రాష్ట్రంలో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించినట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి దేశంలోనే మరే రాష్ట్రానికి రానన్ని అవార్డులు, ప్రశంసలు తెలంగాణ రాష్ట్రానికి దక్కాయని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం అవుతుందనడానికి ఈ అవార్డులు, ప్రశంసలే నిదర్శనమని మంత్రి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానీయా, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.