శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా బాధితులెవరూ ఆందోళన చెందొద్దు. మీ అందరికీ అండగా నేనున్నాను. కంటికి రెప్పలా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. అన్ని రకాల వైద్య సదుపాయాలతో పాటు, అంబులెన్స్, ఇతర సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాను. నిరుపేదలకు నిత్యావసర సరుకులు కూడా అందించాలని అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పాను. ఇంకా మీకు సమస్యలుంటే, నన్ను గానీ, నా సిబ్బందిని గానీ, సంప్రదించండి. అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు.
పాలకుర్తి, తొర్రూరు, రాయపర్తి, పెద్ద వంగర, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల కరోనా బాధితులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, పోలీసులు వివిధ శాఖల అధికారులు, తదితరులతో మంత్రి మాట్లాడారు.కరోనా సెకండ్ వేవ్ తొందరగా వ్యాపిస్తుంది. కరోనా విస్తృతి చాలా ఎక్కువగా వుంది. తీవ్రత చాలా తక్కువగా ఉంది. ధైర్యంగా ఉందాం.జాగ్రత్తలు తీసుకుందాం. కరోనా బారి నుంచి కాపాడుకుందామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఒక్కో పేషంట్ , వారి కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు తెలుసుకుంటూనే, ఎక్కడ? ఎలా ఉంటున్నారని ఆరా తీశారు. అలాగే, వారికి అండగా ఉండాలని స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి చెప్పారు.
అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్సకు సంబంధించిన ఆదేశాలను సంబంధిత జిల్లా వైద్యాధికారి, వైద్యులకు ఇచ్చారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంత్రి మరోసారి గుర్తు చేశారు. పోలీసు అధికారులు కూడా కరోనా బాధితుల హోం క్వారంటైన్, తగు సదుపాయాలు, మిగతా సమాజం తీసుకోవాల్సిన సామాజిక దూరం, స్వీయ నియంత్రణలు కఠీనంగా పాటించేలా చూడాలన్నారు. అలాగే, అందరూ మాస్కులు ధరించాలన్నారు. కరోనా పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు, వైద్యులు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.