సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి స్ఫూర్తితో…సీజన్ వ్యాధులను అరికడదాం. రెండు సార్లు విజయవంతమైన పల్లె ప్రగితి కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే, కరోనా తరహాలో, వచ్చే వర్షాకాల సీజనల్ వ్యాధులను ఎదుర్కోందాం. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. గ్రామాల్లో పారిశుద్ధ్యంతోపాటు, నీరు నిలువ ఉండే చోట్లను గర్తించి, నివారిద్దాం. మంచినీటిని పరిశుభ్రంగా…స్వచ్ఛంగా ప్రజలకు అందిద్దాం. దోమలు పెరగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు చేపడదాం.ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పారిశుద్ధ్యంపై అవగాహన పెంచి సిఎం కెసిఆర్ కలలు గంటున్న గ్రామస్వరాజ్యాన్ని సాధిద్దామని మంత్రి ఎర్రబెల్లి, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, అధికారులందరికీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అంతా కలిసి కట్టుగా సీజనల్ వ్యాధులే రాకుండా జాగ్రత్త పడదాం అని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పారిశుద్ధ్యం వంటి అన్ని కార్యక్రమాల పట్ల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని మంత్రి ఆదేశించారు
సీజనల్ వ్యాధులు, ముందు జాగ్రత్తగా వాటి నివారణ చర్యల పై హైదరాబాద్ లోని లకడీ కా పూల్ లో గల రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల జడ్పీ చైర్మన్లు, జెడ్జీటీసీలు, ఎంపిపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిఆర్ డిఓలు, జెడ్పీ సీఇఓలు, డిపిఓలు, ఎంపీడీఓలు తదితర అధికారులతో కలిపి మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ముందుగా రెండు విడతల పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు అధికారులందరినీ అభినందించారు. పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం అయినందువల్లే, ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ నుంచి తెలంగాణ పల్లెలను సురక్షితంగా ఉంచగలిగామని చెప్పారు. ఇప్పుడు ఆదే పల్లె ప్రగతి స్ఫూర్తితో వచ్చే సీజనల్ వ్యాధులను అరికట్టాలని, అవి రాకుండా అన్ని ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు.
ఈ దశలోనే గ్రామాల్లో వేసిన కమిటీలు యాక్టివ్ గా పని చేయాలన్నారు. సర్పంచ్, కార్యదర్శి, కమిటీల సభ్యులు నీరు నిల్వ ఉండే చోట్లను గుర్తించి, తొలగించాలన్నారు. డ్రైనేజీల్లో నీరు నిలువ ఉండకుండా చేయాలన్నారు. వర్షపునీరు లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లేలా ఇప్పుడే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంటింటికీ ఇంకుడు గుంతలు పెట్టాలి. ఇందుకు సిద్దిపేట జిల్లా ఇబ్రహీం పూర్, మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు.
గ్రామాల్లో క్లోరిన్ అవశేషాలను చెక్ చేస్తూ, స్వచ్ఛమైన మంచినీటిని ప్రజలు అందించాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా 1,11,21 తేదీల్లో, ప్రతి 10 రోజులకోసారి ట్యాంకులను శుభ్రపరచాలన్నారు. లీకేజీలు లేకుండా, నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ సూచించిన విధంగా ప్రతి శుక్రవారాన్ని డ్రై డే గా పాటిస్తూ, ఆరోజు ప్రతి ఇంటిలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
దోమల నివారణకు ముందుగానే ఆయా ప్రాంతాలను గుర్తించి, దోమలు పెరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్లు పంచాయతీ, ఆరోగ్యశాఖ అధికారులతో కమిటీలు వేసి పర్యవేక్షించాలని మంత్రి దయాకర్ రావు ఆదేశించారు. దోమలు అధికంగా ఉండే ప్రాంతాల్లో శిబిరాలు పెట్టడం, ఫాగింగ్ చేయడం, మలేరియా బాల్స్ స్ప్రే చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు.
పల్లెల్లో పక్కాగా పారిశుద్ధ్యం ఉండేలా చూడాలని చెప్పారు. జనసమ్మర్థ ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేయాలన్నారు. ఒకవైపు ఇప్పటికే కరోనా వైరస్ ఇంకా మనతోనే ఉంది. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు జాగ్రత్త వహించకపోతే సీజనల్ వ్యాధులతోపాటు, కరోనా ప్రబలితే కష్టకాలం వస్తుంది. అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారుల మీదే ఆధారపడి ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, దళిత వాడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జూన్ మొదటి వారంలోనే విద్యా, నీటిపారుదల, మంచినీటి సరఫరాశాఖలు సంయుక్త సమావేశాలు పెట్టుకోవాలి. వారం వారం సమీక్షలు చేసుకోవాలి. హై రిస్క్ ఉన్న ప్రాంతాలకు స్పెషల్ ఆఫీసర్ ని నియమించాలి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు క్షేత్ర పరిశీలనకు వెళ్ళాలి. నిధులకు కొరత లేదు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. వచ్చే నాలుగైదు నెలలు జాగ్రత్త పడితే మళ్ళీ ఏడాది వరకు ఇబ్బందులు ఉండవని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు.
కాగా, 25 జిల్లా కేంద్రాలు, 358 మండలాల నుంచి ఈ మెగా వీడియో కాన్పరెన్స్ జరిగింది. 87 మంది జిల్లాల ప్రజాప్రతినిధులు, 15,156 మంది మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం 372 మంది జిల్లా స్థాయిల అధికారులు, 22,847 మంది మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. మొత్తంగా 459 మంది జిల్లా స్థాయి అధికారులు, 38,003 మంది మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కాగా, మొత్తం 38,462 మంది జిల్లా నుంచి గ్రామ స్థాయి స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా నుంచి గ్రామ స్థాయి అధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.