దేశంలో విజయవంతమైన పథకంగా, సిఎం కెసిఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ మంచినీటి సరఫరా పథకాన్ని ప్రజల డిమాండ్ కనుగుణంగా, ప్రజావసరాలు తీరే విధంగా మంచినీటిని అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని మిషన్ భగీరథ (గ్రామీణ మంచినీటి పథకం) కార్యాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎస్సీ, ఇఇలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, మిషన్ భగీరథ పథకం కింద రాష్ట్రంలోని 23,968 ఆవాసాలకు నూటికి నూరు శాతం భూ ఊపరితల ఆరోగ్యవంతమైన మంచినీటిని అందిస్తున్నామన్నారు. 55,59,172 ఇండ్లకు వందకు వంద శాతం నీరందుతుందన్నారు. 19 ఇన్ టేక్ వెల్స్, 50 నీటి శుద్ధి కేంద్రాలు, 1163 సర్వీస్ రిజ్వారయర్లు, 441 సంపులు మౌలిక సదుపాయాలుగా మంచినీటిని అందిస్తున్నామన్నారు. అలాగే లక్షా 46వేల కి.మీ. పైపు లైన్ల ద్వారా ఈ మంచినీటిని అందిస్తున్నామని మంత్రి వివరించారు. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో మంచినీటిని అందిస్తున్న రాష్ట్రం లేదన్నారు. గతంలో సీఎం కెసిఆర్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సింగూరు నీటిని సిద్దిపేటకు అందించిన ప్రయోగాత్మక, విజయవంతమైన స్కీంని మన రాష్ట్రానికి విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
అయితే, ఎండాకాలంలో కత్తెర కార్తె వచ్చిందని, ఈ నెల రోజుల పాటు ఎండలు దంచి కొట్టే అవకాశం ఉందన్నారు. ఈ దశలోనే మంచినీటి వాడకం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ సమయంలో అధికారులు మరింత అప్రమత్తులై పని చేయాలని సూచించారు. ప్రతి రోజూ, ప్రతినిత్యం నిరంతరం మానిటరింగ్ చేయాలని, మంచినీరు అందడంలేదన్న గ్రామం కానీ, గల్లీ కానీ లేకుండా జాగ్రత్త పడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమస్యలేమైనా వస్తే వెంటవెంటనే పరిష్కరించే విధంగా సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. కరోనా, లాక్ డౌన్ ల కారణంగా పెండింగులో ఉన్న పనులేవైనా ఉంటే వాటిని సత్వరమే పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షలో మిషన్ భగీరథ సలహాదారు జ్ఞానేశ్వర్, నర్సింగ్ రావు, ఇఎన్ సి కృపాకర్ రెడ్డి, సిఇలు విజయ్ ప్రకాశ్, జగన్ మోహన్ రెడ్డి, శ్రీనివాసరావు, చక్రవర్తి, శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, వినోబాదేవి తదితరులు పాల్గొన్నారు.