నాలుగో విడత పల్లె ప్రగతి విజయవంతం- మంత్రి ఎర్రబెల్లి

33
errabelli

జూలై 1వ తేది నుండి 10తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడిన పల్లె ప్రగతి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పది రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం ఈ నెల 1వ తేదీన ప్రారంభమైంద‌ని, ఈ కార్యక్రమంలో ప్రధానంగా పారిశుద్యం, మొక్కలు నాటడం, ఇప్పటికే గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమాలను పూర్తి చేయడం లక్ష్యంగా అధికారులకు సీఎం కేసీఆర్‌ దిశా నిర్ధేశం చేశార‌న్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా ఉండాలనే ఉద్దేశంతో పారిశుద్ద్యానికి ప్రాధాన్యత ఇచ్చామ‌న్నారు. మొక్కలు పెద్ద ఎత్తున నాటారు. ఇంటింటికి మొక్కలను పంపిణి చేశారు. విద్యుత్‌ వ్యవస్థ మెరుగు పర్చామ‌న్నారు. మురుగు కాలువ‌ల‌ను శుభ్రం చేశామ‌ని, రోడ్ల ప‌క్క‌న పిచ్చి మొక్క‌ల‌ను తొల‌గించామ‌ని, చ‌నిపోయిన మొక్క‌ల స్థానంలో కొత్త మొక్క‌ల‌ను నాటామ‌న్నారు.

ప‌ల్లె ప్ర‌గ‌తిలో కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు నిర్వహించిన పల్లె ప్రగతి గ్రామ సభలలో ఆయా గ్రామాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో కాలువలను శుభ్రం చేయుట, మంచినీటి పైపులైన్లు, నల్లా లీకేజీ లకు మరమ్మతులు చేపట్టుట, నీటి ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయుట, లోతట్టు ప్రాంతాలు, విద్యా సంస్థలలో, ఆసుపత్రులు, అంగన్వాడి లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో వాన నీటి నిల్వ కు అవకాశం లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని తెలిపారు. దీనికి తోడుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటడం జరిగిందని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో నాలుగవ విడత కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో 6,56,295 రోడ్లను పరిశుభ్రం చేయడం జరిగిందని, 3,51,363 మురుగు కాలువలను పూడిక తీసి శుభ్రం చేశామని, 1,58,251 ప్రభుత్వ సంస్థలను పరిశుభ్రంగా ఉంచామని, 50,261 లోతట్టు ప్రాంతంలో నీటి నిల్వకు అవకాశం లేకుండా మట్టితో పూడ్చామని ఆయన తెలిపారు రాష్ట్రంలోని 12720 వైకుంఠదామాలకు, 12776 డంపింగ్ యార్డ్ లో బయో ఫెన్సింగ్ చేశామని ఆయన తెలిపారు. గ్రామంలోని గృహస్థులకు ఒక్కొక్క ఇంటికి 6 మొక్కలు చొప్పున 7,83,98,,578 మొక్కలను పంపిణీ చేశామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 1,61,07,043 మీటర్ల రహదారుల కిరువైపున మొక్కలు నాటమని, మరో 1,22,21,324 మొక్కలను ఇతర ప్రదేశాలలో నాటమని ఆయన తెలిపారు. గతంలో నాటి చనిపోయిన మొక్కల స్థానం లో కొత్తగా 70.64.719 మొక్కలను నాటామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా తుప్పు పట్టిన పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తగా 25,298 స్తంభాలు మార్పు చేయడం జరిగిందని, 41,652 విద్యుత్ స్తంభాలకు మూడవ వైరు అమర్చడం జరిగిందని ఆయన తెలిపారు. దీనికి తోడుగా కొత్తగా 19.503 విద్యుత్ మీటర్లను సమకూర్చడం జరిగిందని ఆయన తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం మూడు విడతలలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం క్రింద దేశంలోనే మొదటిసారిగా 12 వేల 769 గ్రామాలలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి గ్రామంలో వర్కు కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ట్రీట్ కమిటీ, గ్రీన్ కవర్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న12 వేల 769 గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లు, టాంకర్లు, ట్రాలీలను గ్రామంలో ఉదయమే తడి, పొడి చెత్త సేకరణకు డంపింగ్ యార్డులకు తరలించడానికి, హరితహారం పథకం క్రింద నాటిన మొక్కలకు నీటి సౌకర్యం కల్పించడానికి సమకూర్చమని మంత్రి తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలోని గ్రామాలలో 116 కోట్ల రూపాయాల వ్యయంతో 19 వేల 298 పల్లె ప్రకృతి వనాలు, 1555 కోట్ల రూపాయల వ్యయంతో 12 వేల 728 వైకుంటధామాలు, 318 కోట్ల రూపాయల వ్యయంతో 12 వేల 776 డంపింగ్ యార్డుల నిర్మాణాన్ని పూర్తి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి 2019 సంవత్సరం సెప్టెంబర్ మాసం నుండి ఇప్పటివరకు 6 వేల 500 కోట్ల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంటు మంజూరీ చేశామని ఆయన తెలిపారు.

పల్లె ప్రగతి కార్యక్రమం నాలుగు విడతల అమలు వల్ల గ్రామాలలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని మంత్రి తెలిపారు. ప‌ల్లె ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించడమే కాకుండా ఎప్పటికప్పుడు దిశా నిర్దేశాలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప‌ల్లె ప్ర‌గ‌తి ద్వారా సీఎం కేసీఆర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా పనిచేశామ‌న్నారు. తాను 14 జిల్లాల్లో ప‌ర్య‌టించాన‌ని, ప‌ల్లె నిద్ర కూడా చేశాన‌ని మంత్రి ద‌యాక‌ర్ రావు తెలిపారు. అనేక గ్రామ‌ల్లో గ్రామ స‌భ‌లు నిర్వ‌హించి స్వ‌యంగా పాల్గొన్నాన‌ని, వైకుంఠ‌దామం, ప‌ల్లె ప‌క‌`తి వ‌నం, డంపింగ్‌యార్డు, రైతు వేదిక‌లు, న‌ర్సీర‌ల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింద‌న్నారు. ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ముగిసినా కూడా ఇంకా అసంపూర్తిగా ఉన్న పనుల‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని ద‌యాక‌ర్ రావు ఆదేశాలు జారీ చేశారు.

నాల్గొ విడత కార్యక్రమమంలో పాల్గొనడమే కాకుండా రాష్ట్రంలో కార్యక్రమ అమలుకు అహర్నిశలు కృషి చేసిన శాసన మండలి చైర్మన్ కు, శాసన సభాపతి కి, సహచర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా, పంచాయితీరాజ్ కమీషనర్ శ్రీ రఘునందన్ రావుకు, జిల్లా కలెక్టర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన అన్ని ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు, ఉద్యోగులకు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు, ఉద్యోగులకు, గ్రామ పంచాయితీ సర్పంచ్ లకు, ఉప సర్పంచ్ లకు, పంచాయతీ కార్యదర్శులకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు.