కొత్త గ్రామపంచాయతీలకు దశల వారీగా సొంత భవనాలు నిర్మించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్ జీఎస్ఏ) పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.100 కోట్లతో గ్రామపంచాయతీలకు కొత్తగా భవనాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణాల ప్రతిపాదనల తయారీలో కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూమి లభ్యత ఉండి, సొంత భవనాలు లేని గ్రామాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్, పీఎంజీఎస్ వై-3 దశ ప్రతిపాదనల రూపకల్పనపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం రాష్ట్ర, సర్కిల్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం గ్రామపంచాయతీల సమగ్ర వికాసం లక్ష్యంగా పని చేస్తోంది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా 4,380 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసింది. అన్ని గ్రామపంచాయతీల కార్యాలయాల కోసం భవనాల నిర్మాణం చేపట్టేదిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించాలి. కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలలో కనీసం 20 శాతం జీపీలకు మొదటి దశలో భవనాలు నిర్మించేలా ప్రతిపాదనలు ఉండాలి. భూమి లభ్యత ఉన్న గ్రామాలకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే పీఎంజీఎస్ వై-3వ దశ కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 2,427 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందించే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. పీఎంజీఎస్ వై-3 కింద దశల వారీగా రోడ్ల నిర్మాణానికి మంజూరు వస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్ పర్సన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీల నుంచి ప్రతిపాదనలు తీసుకోండి.
ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేయాలి. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు సింగరేణి కాలరీస్ కంపెనీ దాదాపు రూ.150 కోట్లను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఫౌండ్ కేటాయించనుంది. రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ ఉమ్మడిగా ఈ నిధుల కేటాయింపులు జరగనున్నాయి. బీటీ రోడ్ల ప్యాచ్ వర్కు, రెన్యువల్స్, బస్సులు తిరిగే రోడ్ల మరమ్మత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, శ్మశానవాటిక నిర్మాణం పూర్తి చేసేలా కార్యాచరణ ఉండాలి.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం దీంట్లో చొరవ తీసుకోవాలి. డంపింగ్ యార్డుల ఖర్చు పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.1 లక్ష నుంచి రూ.2.5 లక్షలకు పెంచింది. అన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలి. ఉపాధిహామీ పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా గ్రామాల్లో పనుల ప్రణాళికలు ఉండాలి’ అని మంత్రి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఇంజనీర్లు రాజేశ్వర్‌రెడ్డి, రవీంద్ర, మృత్యుంజయం… ఉమ్మడి జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు సమావేశానికి హాజరయ్యారు.
Panchayat Raj Engineering Dept of State and Circle Officials on the design of Rashtriya Gram Swaraj Abhiyan and PMGS Y-3 Phase Proposals Minister Errabelli..