మానవ జాతి మనుగడకు మొక్కలే జీవనాధారం అని, భవిష్యత్ తరాల వారికి స్వచ్ఛమైన గాలిని అందించడం మన బాధ్యతని, వన సంరక్షణే మన సంరక్షణ కావున అందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా అదనపు ఎస్పీ రాములు నాయక్, గద్వాల డి.ఏస్పీ ఎన్. సి హెచ్ రంగ స్వామి, ఏ.ఆర్ .డి.ఏస్పీ ఇమ్మనియోల్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హరితహారం పై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు. ఫలితంగా అక్కడ ఉండే వారి యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందన్నారు. ప్రకృతి మనకు ఎంతో ముఖ్యమైనదని, ప్రకృతి తరువాతనే జీవకోటి భూమి పైకి వచ్చిందన్న విషయం చరిత్ర చెప్పిన సత్యమన్నారు. భూ మండలంపై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణ వాయువైన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. భూమి మీద పశుపక్ష్యాదుల నివాసం చెట్లేనని, మానవ జీవన విధానంలో చెట్ల పాత్ర ఎంతో ముడిపడి ఉందన్నారు. యూరప్ ప్రాంత దేశాలలో ఉష్ణోగ్రతలు ట్రాఫిక్ సిగ్నల్స్ కరిగిపోయే స్థాయికి పెరిగి సమస్యలు తలెత్తడానికి కారణం పర్యావరణం సమతుల్యం లేకపోవడమేన్నారు. అప్పట్లో మనం చూసిన అడవులు ఇప్పట్లో లేవనే విషయం మనకందరికీ తెలుసునని, రాను రాను జంతువులు అంతరించిపోతున్నాయని , మానవుడు ఎంత ఎదిగిన ప్రకృతిని నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, నారాయణ పేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుకు గ్రీన్ ఛాలెంజ్ విసిరి మొక్కలు నాటి హరితహరాన్ని కొనసాగించాల్సిందిగా జిల్లా ఎస్పీ కోరారు.
ప్రతి ఒక్కరు మొక్కలను నాటడం బాధ్యతగా భావించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలన్న, వారికి మంచి ఆరోగ్యంను అందించాలన్న ఇప్పటి తరం వారు విరివిగా మొక్కలు నాటడం తప్పనిసరని, మానవ జాతి మనుగడకు మొక్కలే జీవనాధారమన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు చొప్పున నాటాలని కార్యాలయ సిబ్బందికి సూచించారు. చివరగా పర్యావరణ పరిరక్షణకు తామంత బాధ్యత తీసుకుంటామని అధికారులతో, సిబ్బంది తో ప్రతిజ్ఞ చేయించారు.