చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. ఇంగ్లండ్ తన భారత పర్యటనను ఘనంగా ఆరంభించింది. 227 పరుగులతో జయభేరి మోగించి సిరీస్ లో 1–0 ఆధిక్యాన్ని సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ద్విశతకం బాదిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్ ను ఇంగ్లండ్ బౌలర్లు జాక్ లీచ్ (4 వికెట్లు), జేమ్స్ ఆండర్సన్ దెబ్బ కొట్టారు. ఆండర్సన్ కు మూడు వికెట్లు దక్కాయి. టీమిండియా బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ (72), శుభ్ మన్ గిల్ మినహా ఎవరూ రాణించలేదు. ఆచితూచి ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లీని బెన్ స్టోక్స్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ విజయం లాంఛనమే అయింది.ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 578, రెండో ఇన్సింగ్స్ లో 178 పరుగులు చేయగా, భారత్ వరుసగా 337, 192 పరుగులకు ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా నాలుగు టెస్టుల్లో ఓడింది.