రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రో ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన పెట్రో ధరలు తగ్గకపోవడంతో అంతా అసహనానికి గురవుతున్నారు. అసలు పెట్రోల్ ధర ఎంత..వాటిలో ట్యాక్స్ రూపంలో ప్రజలపై వడ్డించే బాధుడు ఎంతో తెలియక తికమకపడుతుంటారు. కొంతమందైతే పెట్రోల్ ధర ఎప్పుడు దిగివస్తుందా అని ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి శుభవార్త.
హైదరాబాదీ మెకానికల్ ఇంజనీర్ సృష్టించిన అద్భుతంతో త్వరలో రూ. 40కే లీటర్ పెట్రోల్ అందుబాటులోకి రానుంది. ప్లాస్టిక్ నుంచి సులభంగా పెట్రోల్,డీజిల్‌తో పాటు విమాన ఇంధనాన్ని పొందవచ్చు. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.
ప్రొ. సతీశ్ కుమార్ ఉపయోగించిన ప్లాస్టిక్‌తో పెట్రోల్ తయారీతో ముందుకు వచ్చారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ వద్ద ఒక కంపెనీని రిజిస్టర్ కూడా చేయించారు. దాదాపు 500 కేజీల నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్‌తో 400 లీటర్ల ఇంధనాన్ని తయారు చేయవచ్చు. ఇది చాలా సరళమైన ప్రక్రియ. నీళ్లతో అవసరం లేదు. అలాగే ఎలాగే ఎలాంటి మురికి నీరు ఉత్పత్తి కాదని సతీష్ ఈ సందర్భంగా తెలిపారు.
ప్రస్తుతం ఈయన కంపెనీ రోజుకు 200 లీటర్ల పెట్రోల్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీని కోసం 200 కేజీల ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తోంది. ఈ పెట్రోల్‌ను స్థానిక పరిశ్రమలకు లీటరుకు రూ.40 నుంచి రూ.50 ధరతో విక్రయిస్తోంది. అయితే ఈ పెట్రోల్‌ని వాహనాల్లో ఉపయోగించవచ్చో లేదో ఇంకా తెలియదని ఒకవేళ ఏదైనా చిన్నచిన్న మార్పులు చేసి ఉపయోగించేలా చేస్తే ప్రజలపై పడిన పెనుభారం తగ్గే అవకాశం ఉందని సతీష్ చెబుతున్నారు. సో ఆయన చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి.