గర్భం దాల్చడంలో సమస్యలు ఎదుర్కొంటున్న చాలా మంది మహిళలకు ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి గురించి తెలిసినప్పుడు భయం కలుగుతుంది. అయితే వైద్య నిపుణుల ప్రకారం ఇది పూర్తిగా నిజం కాదు. ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పటికీ అనేక మంది మహిళలు సహజంగా లేదా వైద్య సహాయంతో గర్భం దాల్చగలుగుతున్నారు.
ఎండోమెట్రియోసిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో గర్భాశయపు లోపలి పొరలాంటి కణజాలం గర్భాశయం బయట పెరుగుతుంది. ఇది సాధారణంగా అండాశయాలు, ఫలోపియన్ ట్యూబులు మరియు పెల్విక్ భాగాలపై కనిపిస్తుంది. ఈ పెరుగుదల వల్ల వాపు, గాయాలు మరియు అంటుకట్టే సమస్యలు ఏర్పడి కొన్నిసార్లు సంతానోత్పత్తిపై ప్రభావం చూపవచ్చు.
ఎండోమెట్రియోసిస్ ఉంటే గర్భం రావడం అసాధ్యం అనేది అపోహ మాత్రమే. ఎండోమెట్రియోసిస్ కొన్ని శారీరక సమస్యలు కలిగించవచ్చు కానీ గర్భధారణకు పూర్తిగా అడ్డంకి కాదు. తేలికపాటి లేదా మోస్తరు స్థాయిలో ఉన్న మహిళలు సహజంగానే గర్భం దాల్చిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
పెల్విక్ నొప్పి తీవ్రతే సంతానోత్పత్తి సమస్యల తీవ్రతను సూచిస్తుందని అనుకోవడం కూడా తప్పు. కొందరికి తీవ్రమైన నొప్పి ఉన్నా అండాశయాలు, ఫలోపియన్ ట్యూబులు సరిగానే పనిచేయవచ్చు. మరికొందరికి తక్కువ లక్షణాలే ఉన్నా లోపల గాయాలు ఉండి ఫెర్టిలిటీపై ప్రభావం చూపవచ్చు.
గర్భధారణ సమయంలో హార్మోన్ మార్పుల వల్ల లక్షణాలు తాత్కాలికంగా తగ్గవచ్చు. కానీ ఇది పూర్తిగా నయం అయ్యే వ్యాధి కాదు. ప్రసవం తర్వాత మళ్లీ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలు గర్భం దాల్చాలంటే తప్పనిసరిగా In Vitro Fertilization చేయించుకోవాలనే అభిప్రాయం కూడా తప్పు. వైద్యులు పరిస్థితిని బట్టి వివిధ చికిత్సలు సూచిస్తారు. వాటిలో అండోత్పత్తి ట్రాకింగ్, ఫెర్టిలిటీ మందులు, లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స, IUI లేదా అవసరమైతే IVF ఉన్నాయి.
Also Read:2027 వరల్డ్ కప్ గెలవడమే టార్గెట్!

