భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం(డిసెంబర్-14) ఉదయం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇల్లందు – టేకులపల్లి అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున చండ్ర పుల్లారెడ్డి బాట దళం – పోలీసుల మధ్య ఈ (డిసెంబర్-14) ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది నక్సల్స్ చనిపోయారు.
మృతుల్లో చండ్ర పుల్లారెడ్డి బాట వర్గం రాష్ట్ర కార్యదర్శి .. బొమ్మ నర్సింహ్మ చనిపోయాడు. ఇతని స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా.. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇతనితో పాటు మోకాళ్ల సమ్మయ్య, మధు, వీసం నరేష్, రాము, సుభాష్ లు గుర్తించారు. మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఎన్ కౌంటర్ జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ కిశోర్ అంబర్ ఝా.
ఈ మధ్య కాలంలో అజ్ఞాత దళ కమాండర్ మధు, లింగన్నతో పాటు మరికొంత మంది నక్సల్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన దళాలను కూడా లొంగిపోవాలని కొరియర్ల ద్వారా సమాచారం అందించారు. అయితే పోలీసులకు లొంగిపోకుండా.. ఈ తెల్లవారుజామున (డిసెంబర్ 14) భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు.. టేకులపల్లి అటవీప్రాంతంలో నక్సల్స్ సమావేశం అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు లొంగిపోవాలని సూచించారు. అయితే మొదటగా వాళ్లు కాల్పులు జరపడంతో… తిరిగి తాము కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు.