గ్రేటర్ హైదరాబాద్‌లో త్వరలో ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురాబోతున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. కూకట్‌పల్లి జోన్‌లోని నిజాంపేట కొలన్ రాఘవరెడ్డి హాల్‌లో జరిగిన మన నగరం కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్..నగరంలో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని ..ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే విశ్వనగరం సాధ్యమవుతుందని చెప్పారు.
నగరంలో దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ చేపట్టే చర్యలతో పాటు ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మంచినీరు సంతృప్తకర స్థాయిలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని తెలిపారు. ప్రతి మనిషికి 150 లీటర్ల మంచినీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నామని చెప్పారు. పేదల బస్తీల నుంచి అధునాతన కాలనీల వరకు అన్నింటా సమగ్ర అభివృద్ధి ఉండాలన్నారు. ఒక్కరోజులోనే విశ్వనగరం ఏర్పాటు సాధ్యం కాదన్నారు.
నగర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. శివారు మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తున్నామని చెప్పిన కేటీఆర్… మంచినీటి విషయంలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నామని తెలిపారు. 3 నెలల్లో 56 రిజర్వాయర్లను పూర్తి చేస్తామన్నారు. రానున్న 40 ఏళ్లు ఇబ్బంది లేకుండా పైప్‌లైన్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.