రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలు,గుజరాత్ లో 4 స్థానాలు, కర్ణాటకలో 4 స్థానాలు,రాజస్థాన్ లో 3 స్థానాలు, మధ్యప్రదేశ్ లో 3 స్థానాలు, జార్ఖండ్ లో 2 స్థానాలు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో ఒక స్ధానానికి ఎన్నికలు జరగనున్నాయి.
ఈ విడతలో పదవీ విరమణ పొందుతున్న వారిలో దేశ రాజకీయాల్లోని పలువురు హేమాహేమీలు ఉన్నారు. మాజీ ప్రధాని, జేడీఎస్ (JDS) అధినేత హెచ్.డి. దేవెగౌడ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (ఇద్దరూ కర్ణాటక నుండి), కేంద్ర మంత్రులు రవ్‌నీత్ సింగ్ బిట్టూ (రాజస్థాన్), జార్జ్ కురియన్ (మధ్యప్రదేశ్) ఉన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, శక్తిసిన్హ్ గోహిల్ కూడా రిటైర్ అవుతున్నారు.
ఏపీలో వైసీపీకి చెందిన అల్లా అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వానీలతో పాటు తెలుగుదేశం పార్టీ (TDP)కి చెందిన సానా సతీష్‌ల పదవీ కాలం ముగుస్తోంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 24 స్థానాల్లో అధికార ఎన్డీఏ (NDA) కూటమికి 16 స్థానాలు (బీజేపీ 12, మిత్రపక్షాలు 4) ఉన్నాయి. విపక్ష ఇండియా (INDIA) కూటమికి 5 స్థానాలు ఉన్నాయి (గత ఏడాది జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది). వైఎస్సార్ సీపీకి 3 స్థానాలు ఉన్నాయి.
Also Read:త్వరలో మెడికల్/ఇంజనీరింగ్‌లకు ఒకే పరీక్ష
ఆంధ్రప్రదేశ్‌లోని 4 స్థానాలు, గుజరాత్‌లోని 4 స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో రెండేసి స్థానాలు, కర్ణాటక, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో తలా ఒక స్థానాన్ని గెలుచుకోవచ్చు.

