పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితాలో పటియాలా ఎంపీ ధరమ్‌వీర్ గాంధీ మరియు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు లేవంటూ వచ్చిన వార్తలను ఎన్నికల సంఘం (EC) స్పష్టంగా ఖండించింది. వారి పేర్లు ఓటర్ల జాబితాలోనే ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ప్రత్యేక సగ్ర సవరణ ప్రక్రియలోని సంక్లిష్టత, సాధారణ ప్రజలకు ఇబ్బందికరంగా మారిన తీరుపై ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు.
బిజెపి రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా వ్యాఖ్యలతో మొదలైన వివాదం నడుస్తుండగానే కాంగ్రెస్ ఎంపీ ధరమ్‌వీర్ గాంధీ కూడా పంజాబ్ ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తనతో పాటు కుటుంబ సభ్యుల పేర్లను తొలగించారని ఆరోపించారు. కాగా, ఓటర్ల జాబితాలో గాంధీ పేరును చేర్చామని ఎన్నికల సంఘం స్పష్టం చేసినప్పటికీ, ప్రత్యేక సగ్ర సవరణ (SIR) ప్రక్రియలో ఉన్న సంక్లిష్టతపై పటియాలా ఎంపీ పలు ప్రశ్నలు లేవనెత్తారు.
అలాంటి నివేదికలను ఖండిస్తూ ధరమ్‌వీర్ గాంధీ కుటుంబం ముసాయిదా ఓటర్ల జాబితాలో “ఖచ్చితంగా భాగమే” అని ఎన్నికల సంఘం తెలిపింది. “పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ ధరమ్‌వీర్ గాంధీ, ఆయన భార్య జగదంబ కౌశల్, కుమార్తె రోహిణి పరాశర్, కోడలు చాహత్ సాహుజా మరియు కుమారుడు నభేందు 2026 ఆగస్టు 13న ప్రచురించబడిన ముసాయిదా ఓటర్ల జాబితాలో స్పష్టంగా భాగమై ఉన్నారు. వారు అసెంబ్లీ నియోజకవర్గం (AC) నంబర్ 115 – పటియాలా, పార్ట్ నంబర్ 98లో క్రమ సంఖ్య 44 నుండి 48 ఓటర్లుగా నమోదు చేయబడ్డారు” అని ఎన్నికల సంఘం తన ప్రకటనలో తెలిపింది.
విలేకరులతో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ తన కుటుంబ సభ్యులలో ఒకరి పేరు ఓటర్ల జాబితాలో చేర్పించడానికి 1974 మరియు 1978 నాటి రికార్డులను పరిపాలన యంత్రాంగానికి సమర్పించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సవరణ ప్రక్రియ సాధారణ ప్రజలకు ఏమాత్రం సులభంగా లేదని, ఓటు హక్కును కాపాడుకోవడానికి సామాన్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన ఆరోపించారు.
సమస్య కేవలం మా ఓట్ల గురించి మాత్రమే కాదు, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ మొత్తంపై ఉంది. సాధారణ పౌరులు అనవసర ఇబ్బందులు ఎదుర్కోకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగకుండా ఉండేలా ఈ ప్రక్రియ చాలా సరళంగా, పారదర్శకంగా ఉండాలి అని గాంధీ వ్యాఖ్యానించారు.
Also Read:ISRO:గగన్‌యాన్ అప్‌డేట్

