దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం మొదలైంది. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుండగా ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. ఇక ప్రధాన పార్టీలైతే ఫస్ట్ లిస్ట్‌ను కూడా రిలీజ్ చేశాయి. ఇక ఎన్నికల ప్రచారం అనగానే ఇప్పుడు అందరికి గుర్తుకొచ్చేది అద్దెకు హెలికాప్టర్లు.
ఒకప్పుడు ఎన్నికలు అనగానే నేతలు రోడ్ షోలు,ఒక రోజుకు ఒకటి లేదా రెండు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించేవారు. కానీ ఇప్పుడు టైం తక్కువగా ఉండటంతో హెలికాప్టర్ల ద్వారా సమయాన్ని సేవ్ చేస్తూ ఒక్క రోజే నాలుగు లేదా ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి నేతలైతే రాష్ట్రాన్ని చుట్టేస్తుండగా జాతీయస్ధాయి నేతలైతే ఒకే రోజు పలు రాష్ట్రాల్లో ప్రచారం చేసే అవకాశం వచ్చింది.
అయితే నేతలు ఉపయోగిస్తున్న హెలికాప్టర్స్ గంట కిరాయి ఎంతనే దానిపైనే చర్చ జరుగుతోంది. ఇక దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతో హెలికాప్టర్లకు డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతానికి విమానాలు, హెలికాప్టర్లు గిరాకీకి సరిపడా లేవని క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రంజన్ మెహ్రా వెల్లడించగా అధిక డిమాండ్ నేపథ్యంలో కొంత మంది వీటిని లీజుకు కూడా తీసుకుంటున్నారు.
ఇక అసలు విషయానికొస్తే చార్టర్డ్ విమానాలకు గంటకు రూ.4.5 లక్షల నుంచి రూ.5.25 లక్షలు ఉండగా, హెలికాప్టర్లకు గరిష్ఠంగా గంటకు రూ. 3.5 లక్షల వరకు చెల్లించడానికి కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే రోజుకు కనీసం మినిమం ఇన్ని గంటలు ఉపయోగించాలనే నిబంధన ఉండటంతో 24 గంటల ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఏ లెక్కన చూసుకున్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి దాదాపు వెయ్యి కోట్లు కేవలం హెలికాప్టర్ ద్వారా ప్రచారానికే ఉపయోగిస్తుండటం విశేషం.
Also Read:ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే ..‘లైన్ మెన్’