ఎల్‌నినో ఎఫెక్ట్..నూనెల కొరత ప్రమాదం!

3
- Advertisement -

ఎల్‌నినో ప్రభావంతో 2027 నాటికి భారత్‌లో వంట నూనెల కొరత మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా నూనెగింజల ఉత్పత్తి ఆశించిన స్థాయిలో పెరగకపోవడం, ఆగ్నేయాసియా దేశాల్లో పామాయిల్ సరఫరాపై ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం పడటం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా భారత్‌పై దిగుమతుల భారం పెరగడంతో పాటు వంట నూనెల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

ప్రపంచంలోనే అత్యధికంగా వంట నూనెలను దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అంచనాల ప్రకారం.. 2025-26 పంట సీజన్‌లో దేశీయ వంట నూనెల ఉత్పత్తి సుమారు 96 లక్షల టన్నులుగా ఉంది. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారితే ఈ ఉత్పత్తి మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

భారత్‌కు అవసరమైన పామాయిల్‌లో ఎక్కువ భాగం ఇండోనేషియా, మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి దిగుమతి అవుతోంది. ఎల్‌నినో కారణంగా ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడం, నేలలో తేమ లోపించడం వంటి పరిస్థితులు ఆయిల్ పామ్ పంట దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ గణాంకాల ప్రకారం.. పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు చారిత్రక స్థాయులను మించి నమోదైన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

సెబీ వద్ద నమోదైన కమోడిటీ మార్కెట్ విశ్లేషకుడు ముఖేశ్ టైలర్ ఎన్డీటీవీ ప్రాఫిట్‌తో మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు పెరుగుతున్నప్పటికీ, భారత్‌కు ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు, ప్రభుత్వ విధానాలు కొంతవరకు రక్షణ కల్పించగలవని అభిప్రాయపడ్డారు.2022లో ఇండోనేషియా తాత్కాలికంగా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ భారత్ ఆ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొందని ఆయన గుర్తుచేశారు. ఈసారి కూడా ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే సవాళ్లను ప్రభుత్వం అధిగమించే అవకాశం ఉందన్నారు.

Also Read:భారత్‌తో టీ20 సిరీస్‌..డబుల్ షాక్!

అయితే దేశీయంగా సోయాబీన్ ఉత్పత్తిపై ఒత్తిడి పెరుగుతోందని టైలర్ పేర్కొన్నారు. 2026-27 సీజన్‌లో వంట నూనెల ఉత్పత్తిపై 5 నుంచి 10 శాతం వరకు ప్రభావం పడవచ్చని అంచనా వేశారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రధాన సోయాబీన్ సాగు ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. మరోవైపు, మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలో తగిన వర్షపాతం నమోదవడం కొంత ఊరటనిచ్చే అంశమని తెలిపారు.

భారత్‌లో అత్యధికంగా వినియోగించే తక్కువ ధరకు లభించే వంట నూనెల్లో పామాయిల్ ఒకటి. అంతర్జాతీయ మార్కెట్లలో దీని సరఫరా తగ్గితే భారతీయ దిగుమతిదారులు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌లో వంట నూనెల ధరలపై పడుతుంది. తద్వారా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ)లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది.

- Advertisement -