మోహ‌న్ లాల్‌కు ఈడీ నోటీసులు..

13
Mohanlal

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌కు కొచ్చి ఈడీ అధికారులు నోటీసులు పంపారు. మనీలాండరింగ్‌ కేసు విషయంలో వ‌చ్చే వారం విచార‌ణ‌కు రావాలంటూ అధికారులు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేశారు. ఇందు కోసం కొచ్చిలోని ఈడీ ఆఫీసుకు రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్‌ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్‌ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ విష‌యం నిర్ధార‌ణ కోస‌మే ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలిపారు. అయితే ప్రజలను రూ. 10 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై మాన్సన్‌ను గత సెప్టెంబర్‌లోనే కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో ఉన్న మాన్సన్‌ ఇంటికి మోహన్‌ లాల్‌ ఒకసారి వెళ్లినట్లు సమాచారం. అయితే అలా మోహన్‌ లాల్‌ వెళ్లడానికి కారణాలు తెలియరాలేదు.

‘కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి రూ. 10 కోట్ల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్‌ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాఝీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలిగోరు వంటి వస్తువులు ఉన్నాయని చెప్పాడం అబద్ధం.’ అని కేరళ పోలీసులు తెలిపారు. కాగా కేరళలోని అలప్పుజా జిల్లాలో నకిలీ పురాతన వస్తువులు విక్రయిస్తున్నాడని 52 ఏళ్ల యూట్యూబర్‌ను కూడా కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు.తాజాగా ఈ కేసుపై దృష్టి సారించిన ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు.