ఎన్నికల సిబ్బంది శిక్షణ ఏర్పాట్లపై ఈసీ సమీక్ష..

231
ec

ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఈ నెల 24 నుండి 27వ తేదీలోపు బ్యాలెట్ పేపర్ల ముద్రణ 25 వ తేదీ లోపు పూర్తవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి అన్నారు. సోమవారం (23-11-2020) జీహెచ్ఎంసీ ఎన్నికల కొరకు నియమితులైన సాధారణ పరిశీలకులు, జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి మరియు కమీషనర్, జోనల్ కమీషనర్లతో తమ కార్యాలయం నుండి టేలికాన్ఫెరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా ఈసీ మాట్లాడుతూ: పోస్టల్ బ్యాలెట్ ముద్రణ ఈ రోజు పూర్తవుతుందని, రేపు సర్వీస్ ఓటర్లకు పంపడం జరుగుతుందని, రెగ్యులర్ బ్యాలెట్ పేపర్ల ముద్రణ నవంబరు 25 లోపు పూర్తి అవుతుందన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ నవంబరు 24 మరియు 25న నిర్వహించబడుతుందని, వెబ్ క్యాస్టింగ్ వాలంటీర్లకు 27న, మైక్రో అబ్సర్వర్లకు 28న శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు ఎన్నికల నిర్వహణ సందర్బంగా మరిన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వేలెన్సు టీంలను పెంచాలని, శాంతి భద్రతల పర్యవేక్షణ కొరకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూంల కిటికీలను ఇటుకల గోడతో కాని, చెక్కలతో కానీ మూయాలని, రెండు కౌంటింగ్ హాళ్లలో కౌంటింగ్ జరిగే కేంద్రాల్లో అవసరమైన చోట అదనపు రిటర్నింగ్ అధికారిని నియమించాలన్నారు. రౌడీ షీటర్లను, సమస్యలు సృష్టించే వారిని ఐపీసీ / సీఆర్పీసీ క్రింద బైండోవర్ చేస్తూ అవసరమైన చోట నిర్బంధించడం కూడా చేయాలన్నారు.