తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీనంతటికీ కారణం జయలలిత మరణం. అమ్మ మరణానంతరం తమిళ రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. తాజాగా రెండు వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకే.. పార్టీ సింబల్ కోసం పోటీ పడుతున్నాయి. సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం ఓ వైపు.. శశికళ వర్గం మరోవైపు రెండాకుల గుర్తు కోసం పోటీ పడ్డాయి.
(నేడు) 23వ తేదీ గురువారం ఉదయం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం ప్రకటించింది. పళని – పన్నీర్ వర్గాన్ని అన్నాడీఎంకే వారసులుగా గుర్తించి, అసలైన వారసులు వీళ్లే అని స్పష్టం చేస్తూ రెండాకుల సింబల్ ని కేటాయించింది.
తమిళనాడు ప్రభుత్వం – శశికళ వర్గం వాదనలు విన్న ఎలక్షన్ కమిషన్.. అన్నాడీఎంకేలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు జిల్లాల కార్యదర్శులు ఎవరి వైపు ఉన్నారు అనేది లెక్క కట్టింది. వాళ్ల అభిప్రాయాలు తీసుకుంది. పూర్తి వివరాలు సేకరించింది.
అయితే .. పార్టీ నుంచి శశికళ వర్గాన్ని శాశ్వతంగా బహిష్కరించాం అని.. వారికి జయలలిత స్థాపించిన పార్టీతో సంబంధం లేదని ప్రభుత్వం, పార్టీ తరపున గట్టిగా వాదించారు. అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత అన్నాడీఎంకే పార్టీకి, జయలలిత వారసులు పళని – పన్నీర్ వర్గానిదే రెండాకుల గుర్తు అని ప్రకటించింది ఎన్నికల కమిషన్.