రివ్యూ: దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌

383
Duvvada Jagannadham review
Duvvada Jagannadham review
- Advertisement -

వరుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న అల్లు అర్జున్.. అభిమానుల‌తో పాటు.. స‌గ‌టు సినీ ప్రేమికుడిని సైతం అల‌రించేలా క‌థ‌ల్ని ఎంపిక చేసుకొంటున్నాడు. దాంతో అల్లు అర్జున్ సినిమా అన‌గానే అంచ‌నాలు ఆకాశానికి తాకుతున్నాయి. `డీజే… దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` విష‌యంలోనూ అదే జ‌రిగింది. మాస్ ప్రేక్ష‌కుల నాడి తెలిసిన ద‌ర్శ‌కుడిగా.. హీరోయిజాన్ని తెర‌పై బాగా ఆవిష్క‌రిస్తార‌నే పేరున్న హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కిస్తుండ‌డంతో `డీజే` చిత్రం ప్రేక్ష‌కుల‌తో పాటు.. ప‌రిశ్ర‌మ కూడా ఆస‌క్తిక‌రంగా ఎదురు చూసింది. అల్లు అర్జున్ బ్రాహ్మ‌ణ యువ‌కుడి పాత్ర‌ని పోషించ‌డంతోపాటు.. ఆ స‌న్నివేశాల‌తో విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు బాగా సంద‌డి చేశాయి. సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగేలా చేశాయి.

కథ:
దువ్వాడ జ‌గ‌న్నాథ శాస్త్రి (అల్లు అర్జున్‌) మంచి వంటగాడు. చేయితిరిగిన వంటగాడు కావడంతో విజ‌య‌వాడ స‌మీపంలోని స‌త్య‌నారాయ‌ణ‌పురం అగ్ర‌హారంలో ఉంటూ ఆ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో జ‌రిగే వేడుక‌ల్లో త‌న చేతి వంట‌ల రుచుల్ని చూపిస్తుంటాడు. వంటలే లోకంగా బ్రతుకుతున్న శాస్త్రికి ఫ్యాష‌న్ డిజైన‌ర్ పూజ (పూజ‌హెగ్డే)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అది ప్రేమగా మారుతుంది. మ‌రోప‌క్క‌ వంట‌లు చేసుకుంటునే శాస్త్రి ఎవ‌రికీ తెలియ‌కుండా, త‌న‌ని తాను డీజేగా ప‌రిచ‌యం చేసుకొంటూ హైద‌రాబాద్‌లో ప‌నుల్ని చ‌క్క‌బెడుతుంటాడు. ఒకొక్క‌రినీ టార్గెట్ చేసి చంపేస్తుంటాడు. ఇంత‌కీ శాస్త్రి డీజేగా ఎందుకు మారాల్సి వ‌స్తుంది? బ్రాహ్మ‌ణ యువ‌కుడైన శాస్త్రి హ‌త్య‌లు చేసేవ‌ర‌కు ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చింది? అందుకు ఆయ‌న్ని ప్రోత్స‌హించిన పురుషోత్తం ఎవ‌రు? రొయ్య‌ల నాయుడు (రావు ర‌మేష్‌)తో శాస్త్రికి వైరం ఎలా ఏర్ప‌డింది? అత‌ని అక్ర‌మాల‌ని బ‌య‌టపెట్టేందుకు శాస్త్రి ఏం చేశాడు? లాంటి విష‌యాల‌తో సినిమా సాగుతుంది.

allu DJ

ప్లస్ పాయింట్స్‌:
బ్రాహ్మ‌ణ యువ‌కుడైన శాస్త్రి.. ఆయ‌న కుటుంబం నేప‌థ్యంలో సాగే ఓ ప్ర‌తీకార క‌థ ఇది. కథ తెలిసిందే అయినా కథనం, దర్శకుడు హరీష్ శంకర్ కథను డీల్ చేసిన విధానం అద్భుతమని చెప్పాలి. దువ్వాడ‌ జ‌గ‌న్నాథ శాస్త్రి పాత్ర చుట్టూ అల్లిన స‌న్నివేశాలే సినిమాకి కొత్త‌ద‌నాన్ని పంచాయి. విదేశాల్లో ఉండే ప్రధాన విలన్‌కు, పెళ్లిళ్లలో వంట చేసుకునే దువ్వాడ జగన్నాథమ్‌కు సంబంధం ఏమిటనేది ఇంట్రస్టింగ్ పాయింట్‌. అల్లు అర్జున్ రెండు కోణాల్లో అంటే అటు అటు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ శాస్త్రిగా, ఇటు డీజేగా ఇరగదీశాడు. ఇక పాటల్లో బన్నీ డాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘గుడిలో మడిలో’ సాంగ్‌లో బన్నీ, పూజాహెగ్డే డాన్స్ ఇరగదీశారట. అందాల ఆరబోతలో తానేం తక్కువ తినలేదన్నట్లు పూజాహెగ్డే నటించింది. పూజా హెగ్డే ప్ర‌తి స‌న్నివేశంలోనూ గ్లామ‌ర్‌గా క‌నిపించింది. ముఖ్యంగా విరామానికి ముందు వ‌చ్చే యాక్ష‌న్ ఘ‌ట్టం ఆక‌ట్టుకునేలా ఉంటుంది. రొయ్యల నాయుడు పాత్రలో రావు రమేష్.. తండ్రి రావుగోపాలరావును గుర్తుకు తెచ్చారు. వెన్నెల కిషోర్‌, సుబ్బ‌రాజు, ముర‌ళీశ‌ర్మ వాళ్ల వాళ్ల పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

allu DJ2

మైనస్ పాయింట్స్‌:
సాధారణమైన కథ.. ఊహకు అందే సన్నివేశాలు ప్రధానలోపాలుగా చెప్పచ్చు. క‌థ‌లో కొన్నైనా మ‌లుపులుంటే బాగుండేద‌నిపిస్తే అది ప్రేక్ష‌కుడి త‌ప్పు కాదు. పూజాహెగ్డే పాత్ర‌కి చెప్పుకోద‌గ్గ ప్రాధాన్యం లేదు.. కేవలం గ్లామర్ రోల్ కోసమే పూజాను తీసుకున్నట్లుగా అనిపిస్తుంది.

allu DJ2

సాంకేతిక విభాగం:
హ‌రీష్ శంక‌ర్ త‌న క‌లానికి మ‌రింత ప‌దునుపెట్టి సంభాష‌ణ‌ల్ని రాశారు. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న ప‌నితీరుకి మంచి మార్కులే ప‌డ‌తాయి. అల్లు అర్జున్‌ యాక్ష‌న్‌, డ్యాన్సుల్లో మ‌రోసారి తానేంటో చూపించాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. దేవిశ్రీప్ర‌సాద్ పాట‌ల‌తోనూ, నేప‌థ్య సంగీతంతోనూ సినిమాకి ప్రాణం పోశారు. అయ‌నంక బోస్ కెమెరా ప‌నిత‌నం కంటికి ప‌సందైన విందులా ఉంటుంది. దిల్‌రాజు నిర్మాణ విలువ‌లు తెర‌పై అడుగ‌డుగునా క‌నిపిస్తాయి.

తీర్పు:
బ్రాహ్మణ పాత్రలో బన్నీ నటించిన తీరుకు ప్రేక్షకులు మంచి మార్కులే వేస్తున్నారు. అదుర్స్‌ సినిమాలో ఎన్టీఆర్ బ్రాహ్మణ యువకుడిగా నటించి మెప్పించినట్లుగానే… ఈ సినిమాలో తనదైనశైలిలో నటించి మంచి మార్కులే కొట్టేశాడు బన్నీ. అల్లు అర్జున్ ఇదివ‌ర‌కు చేయ‌ని ఓ కొత్త ర‌క‌మైన పాత్ర‌లో క‌నిపించ‌డం ప్రేక్ష‌కుల‌కు కూడా కొత్త‌ద‌నాన్ని పంచుతుంది. మొత్తానికి బన్నీ అభిమానులు మెచ్చే కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సినిమాను చెప్పుకోవచ్చు..

విడుదల తేదీ:23/06/2017
రేటింగ్ : 3.25/5
న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే.
సంగీతం: దేవిశ్రీప్ర‌సాద్‌
నిర్మాణం: దిల్ రాజు.. శిరీష్‌
ద‌ర్శ‌క‌త్వం: హ‌రీష్ శంక‌ర్‌

- Advertisement -