దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది..

167
Dubbak campaigning

దుబ్బాకలో ఉప ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికలు జరగుతున్న సంగతి తెలిసిందే. దుబ్బాక బై ఎలక్షన్లలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత కొన్నిరోజులుగా దుబ్బాకలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తించాయి. ఇక 3వ తేదీ పోలింగ్ జరగనుండగా, నేటితో ప్రచారానికి తెరపడింది.

అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక బరిలో ఉన్నారు. మరో ఐదు మంది అభ్యర్థులు చిన్న పార్టీల బీ ఫామ్ తెచ్చుకొని బరిలో నిలిచారు. మిగతా 15 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు. మొత్తం పోలింగ్ బూత్‌లు 315. అందులో సమస్యాత్మకమైన బూత్‌లు 23 గా గుర్తించారు. అక్కడ ఒకటికి రెండింతలు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఈ ఎన్నికల్లో ఫలితాలు 10వ తేదీన వెల్లడి కానున్నాయి.