పంజాబ్‌ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్..

117
csk

శనివారం అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 13 మ్యాచ్ లో భాగంగా ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని పట్టుదలతో ఉన్న పంజాబ్ ఆశలపై చెన్నై నీళ్లు చల్లింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ధోనీసేన పోతూ పోతూ తమ వెంట పంజాబ్ ను కూడా తీసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో ఓటమితో పంజాబ్ జట్టు నాకౌట్ అవకాశాలకు తెరపడింది. మొత్తానికి ఆ జట్టు ఐదోస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. పెద్దగా కష్టసాధ్యం కాని లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 154 పరుగులు చేసి విజయభేరి మోగించింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 49 బంతుల్లో 62 పరుగులు చేయగా, మరో ఓపెనర్ డుప్లెసిస్ 34 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సులతో 48 పరుగులు చేశాడు. తెలుగుతేజం అంబటి రాయుడు మరోసారి నిలకడగా ఆడి 30 బంతుల్లో 30 పరుగులు చేసి జట్టు సాఫీగా విజయతీరం చేరడంలో సహకరించాడు. పంజాబ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ కు ఒక వికెట్ లభించింది.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు 23 సార్లు ముఖా ముఖి తలపడ్డాయి. చెన్నై 14 సార్లు విజయం సాధించగా.. పంజాబ్ టీమ్ 9 సార్లు గెలిచింది. టోర్నీలో ఇంతకు ముందు ఓసారి ఇరు జట్లు మ్యాచ్ ఆడాయి. అక్టోబరు 4న చెన్నై జట్టు 10 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో మరోసారి పంజాబ్‌ను ఓడించి.. తమతో పాటు పంజాబ్‌ను ఇంటికి తీసుకెళ్తోంది ధోనీ సేన.