మొక్కల తోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఏవో డాక్టర్ కే రాజశేఖర్ గౌడ్ అన్నారు. తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వైరా మండలం పాలడుగు గ్రామంలో తన సతీమణి డాక్టర్ సుజనా గౌడ్‌తో కలిసి డాక్టర్ కే రాజశేఖర్ గౌడ్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు అందమైన ప్రకృతిని బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం మాదిరే అందరూ హరిత తెలంగాణలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రతి నెల మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యులుసంతోష్ 17 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించారని అన్నారు. రంగారెడ్డి జిల్లా కీసరగుట్టలో “మియావాకి” పద్ధతిలో పెంచుతున్న అరణ్యమే ఇందుకు ఉదాహరణ అన్నారు.
సంతోష్ చేపట్టిన ఈ హరిత ఉద్యమం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. సంతోష్ కుమార్ ప్రేరణతో “కోటి వృక్షార్చన”లో భాగంగా తాను తన సతీమణితో కలిసి ఖమ్మంలోని వివిధ ఆలయాల్లో జమ్మి మొక్కలు నాటమని గుర్తు చేశారు. మునుముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఖమ్మం జిల్లాలో ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా రాజశేఖర్ గౌడ్ అన్నారు.