ప్రచారంలో చిన్నారులను వినియోగించుకోవద్దు: ఈసీ

35
- Advertisement -

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారం లోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించు కుంటోన్నాయి.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లలను వినియోగించుకునే రాజకీయ పార్టీలకు హెచ్చరికలను జారీ చేసింది. మైనర్ బాలురు/బాలికలతో ఎన్నికల ప్రచారం చేసే రాజకీయ పార్టీలు గానీ, వాటి తరఫున పోటీ చేసే అభ్యర్థులపై గానీ కఠిన చర్యలను తీసుకుంటామని తెలిపింది.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?

ర్యాలీలు, బహిరంగ సభలు, రోడ్ షో, ఇంటింటికీ తిరగడం, తమకు అనుకూలంగా నినాదాలు చేయడం, పోస్టర్లు, పామ్ ప్లేట్లను పంచడం.. వంటి ప్రచారాలు లేదా దానికి సంబంధించిన కార్యక్రమాల్లో చిన్న పిల్లలను దూరంగా ఉంచాలని ఈసీ అన్ని రాజకీయ పార్టీలు/అభ్యర్థులకు సూచించింది.తమ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అభ్యర్థులు పిల్లలను ఎత్తుకోవడం, తమ వాహనాల్లో తిప్పడాన్ని కూడా నిషేధించినట్లు ఈసీ తెలిపింది. అలా చేయడం మార్గదర్శకాల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఒక రాజకీయ పార్టీ లేదా అభ్యర్థికి అనుకూలంగా పాటలు/పద్యాలు పాడటం, డాన్స్ చేయడం, అనుకూలంగా మాట్లాడటం వంటివీ.. ప్రచారం కిందికే వస్తాయి.

బాల కార్మికుల నిషేధ సవరణ చట్టం – 2016 కిందికి.. ఆయా చర్యలన్నీ శిక్షార్హమైనవని ఈసీ వివరించింది. దీన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యతను జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లకు అప్పగించింది. దీన్ని ఉల్లంఘించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలను తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఈసీ జాయింట్ డైరెక్టర్ అనూజ్ చందక్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -