డీలిమిటేషన్..డీఎంకే మద్దతు ఇస్తుందా?

1
- Advertisement -

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మళ్లీ ప్రవేశపెడితే… ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బిల్లుకు మద్దతు తెలపాలంటే కేంద్రం ముందు 3 ప్రధాన షరతులను ఉంచినట్లు శుక్రవారం ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉన్న లోక్‌సభ సీట్ల ఫ్రీజ్ పరిమితి 2027తో ముగుస్తుంది. రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఫ్రీజ్‌ను మరో 25 ఏళ్ల పాటు పొడిగించాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. ఏప్రిల్‌లో ఈ చట్టాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నోటిమాటగా ఇచ్చిన హామీ ప్రకారం… దేశంలోని అన్ని రాష్ట్రాల లోక్‌సభ సీట్లలో ఒకేసారి 50 శాతం పెంపు చేపట్టాలి .

నూతన చట్టంతో పాటుగా అన్ని రాష్ట్రాల్లో పునర్విభజన తర్వాత ఏర్పడే లోక్‌సభ నియోజకవర్గాల పూర్తి జాబితాను కేంద్ర ప్రభుత్వం ముందే ప్రచురించాలి. ఈ మూడు షరతులకు కేంద్రం అంగీకరిస్తే బిల్లుకు మద్దతు ఇవ్వడానికి డీఎంకే సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, బిల్లు తుది ముసాయిదా, దానిలోని నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పార్టీ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకుంటుంది.

ఇప్పటివరకు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు ఈ బిల్లు గొడ్డలిపెట్టుగా మారుతుందని ఆరోపించింది. అయితే, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ, తమిళగ వెట్రి కళగం (TVK) నాయకుడు సి. జోసెఫ్ విజయ్‌తో పొత్తు పెట్టుకోవడంతో డీఎంకే-కాంగ్రెస్ కూటమి ముగిసింది. ఈ పరిణామాల తర్వాతే మోదీ ప్రభుత్వానికి డీఎంకే మద్దతు ఇవ్వవచ్చనే ప్రచారం ముమ్మరమైంది. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలులోకి తీసుకురావడానికి లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుండి 816కు పెంచే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందడానికి ఎన్‌డీఏ కూటమికి మూడింట రెండొంతుల మెజార్టీ (2/3rd majority) అవసరం.

Also Read:కాంగ్రెస్‌కు సీపీఐ కూనంనేని తీవ్ర హెచ్చరిక

సభలో అందరు సభ్యులు (540 మంది) హాజరైతే బిల్లు నెగ్గడానికి 360 ఓట్లు కావాలి. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్‌డీఏకు 319 మంది ఎంపీలు ఉన్నారు (శివసేన UBTకి చెందిన 7 మంది ఎంపీలు ఏక్‌నాథ్ షిండే వర్గంలో విలీనం కావడం, తృణమూల్ కాంగ్రెస్ రెబెల్స్/NCPI మద్దతుతో). లోక్‌సభలో డీఎంకేకు 22 మంది ఎంపీలు ఉన్నారు. డీఎంకే మద్దతు తెలిపితే ఎన్‌డీఏ బలం 341కి పెరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP), జెడ్పీఎం (ZPM) పార్టీలు కూడా మద్దతు ఇస్తే ఎన్‌డీఏ బలం 354కు చేరుకుంటుంది.

ఆగస్టు 16 నుండి 18 వరకు ఈ బిల్లు కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారనే వార్తలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగియనున్నాయి.

- Advertisement -