సిద్ధూ నివాసంలో డీకే బ్రేక్‌ఫాస్ట్!

4
- Advertisement -

కర్ణాటకలో నాయకత్వ మార్పు (సీఎం మార్పు) జరుగుతుందనే ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో గురువారం ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసం ‘కావేరి’కి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేరుకున్నారు. కాంగ్రెస్ కీలక నేతలతో ఏర్పాటు చేసిన “బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్” (ఉపాహార సమావేశం) లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఈ పరిణామంతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

భారీ భద్రత నడుమ జరిగిన ఈ సమావేశానికి డీకే శివకుమార్‌తో పాటు పలువురు కర్ణాటక మంత్రులు కూడా హాజరయ్యారు. ప్రియాంక్ ఖర్గే, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, హెచ్‌కే పాటిల్ వంటి ప్రముఖ నేతలు సిద్ధరామయ్య నివాసానికి చేరుకున్నారు. గత కొన్ని నెలలుగా కర్ణాటకలో సీఎం మార్పుపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నప్పటికీ, అధిష్టానం మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తూ వస్తోంది. అయితే, తాజా పరిణామాలు చూస్తుంటే మార్పు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పీఠం దక్కనుందనే ప్రచారం గట్టిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం శివకుమార్ నివాసం వెలుపల ఆయన మద్దతుదారులు, అభిమానులు స్వీట్లు పంచి సంబరాలు కూడా చేసుకున్నారు. అంతకుముందు మంగళవారం నాడు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నాయకత్వ మార్పునకే అధిష్టానం మొగ్గు చూపుతోందని, సిద్ధరామయ్యను తప్పుకోవాల్సిందిగా స్పష్టం చేసినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.

మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ ఎమ్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు. సిద్ధరామయ్య ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారని పఠాన్ తెలిపారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని, బహుశా డీకే శివకుమార్ కర్ణాటక తదుపరి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -