కర్ణాటక వ్యాప్తంగా మంగళవారం ఓటర్ల జాబితా ప్రత్యేక నిఘా సవరణ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో… పౌరులందరూ ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోరారు. ఓటు హక్కును కోల్పోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని కూడా కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ…ఓటు హక్కు అనేది జీవించే హక్కు లాంటిది అని శివకుమార్ అన్నారు. పశ్చిమ బెంగాల్ పరిణామాలను ప్రస్తావిస్తూ.. పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఐఆర్ (SIR) ఆధారంగా అర్హత లేని రేషన్ లబ్ధిదారులందరినీ గుర్తించి తొలగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటున్నాయి. కాబట్టి మీరు ఓటు హక్కు కోల్పోతే, ప్రభుత్వ ప్రయోజనాలను కూడా కోల్పోతారు అని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను సేకరించే ఈ ప్రక్రియ కర్ణాటకవ్యాప్తంగా జూలై 29 వరకు కొనసాగనుంది. ఈ సవరణ ప్రక్రియకు ముందే, పౌరులు ఎస్‌ఐఆర్ ప్రక్రియను సులభంగా పూర్తి చేయడానికి వీలుగా శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలను జారీ చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రెవెన్యూ శాఖ దీనికి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది.
పౌరులు ఈ శాశ్వత నివాస ధృవీకరణ పత్రం కోసం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ‘సేవా సింధు’ (Seva Sindhu) పోర్టల్ ద్వారా, ఆఫ్‌లైన్‌లో అటల్ జనస్నేహి కేంద్రాలు (నాడకచేరిలు), బెంగళూరు వన్, కర్ణాటక వన్ మరియు గ్రామ వన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read:ట్రెండింగ్‌లో ‘ఇరుముడి’ సాంగ్

