E20 పెట్రోల్‌పై సుప్రీంలో కేంద్రం

2
- Advertisement -

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం (E20) అనేది ప్రస్తుతం ఒక ప్రయోగ దశలో ఉందని వచ్చే ఏడాది నాటికి ఈ విధానం యొక్క పూర్తి ఫలితాలు స్పష్టమవుతాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.ఇథనాల్ బ్లెండింగ్ (కలపడం) కార్యక్రమంపై దేశంలో విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పాత వాహనాలు దెబ్బతినే అవకాశం ఉందని, మైలేజ్ (ఇంధన సామర్థ్యం) తగ్గుతుందని వాహన ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, E20 ఇంధనం వల్ల వాహనాలకు యాంత్రికంగా నష్టం జరుగుతుందనేదానికి ఎలాంటి గట్టి ఆధారాలు లేవని పేర్కొంటూ ప్రభుత్వం ఈ భయాలను పోగొట్టే ప్రయత్నం చేసింది. ఈ విధానం వల్ల దేశ ఇంధన భద్రతకు, రైతులకు మరియు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేసింది.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనల సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఈ విషయాలను కోర్టుకు సమర్పించారు. 2025-26 సరఫరా సంవత్సరానికి ఇథనాల్ కేటాయింపులకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ బీపీసీఎల్ ఈ పిటిషన్ వేసింది. 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ అనేది ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయోగం. వచ్చే ఏడాది నాటికి దీని ఫలితాలు మన ముందుకు వస్తాయి అని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు.

అక్టోబర్ 2025లోనే ఇథనాల్ సరఫరా ఒప్పందాలు ముగిశాయని, ఇలాంటి పిటిషన్లు మరికొన్ని హైకోర్టులలో కూడా పెండింగ్‌లో ఉన్నాయని అటార్నీ జనరల్ చెప్పారు. ఈ వివాదం వల్ల జాతీయ విధానంపై ప్రభావం పడుతుందని…ఇథనాల్ సరఫరా ఒప్పందాల పునరుద్ధరణ జరిగే అక్టోబర్ లోపే ఈ సమస్య పరిష్కారం కావాల్సి ఉందన్నారు. అందుకే దీనిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆయన కోరారు.

విచారణ ముగిసిన కొద్దిసేపటికే అటార్నీ జనరల్ స్పష్టత ఇస్తూ.. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం అనేది ఒక విధానపరమైన నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే డిమాండ్ మరియు ఇతర అంశాల ఆధారంగా కంపెనీలకు అందుబాటులో ఉంచే ఇథనాల్ పరిమాణంలో మార్పులు ఉండవచ్చు అని చెప్పారు.

Also Read:ట్రెండింగ్‌లో ‘ఇరుముడి’ సాంగ్

భారతదేశం నిర్ణీత గడువు కంటే ఐదేళ్ల ముందే, అంటే గత ఏడాదిలోనే 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా ఈ ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను సరఫరా చేస్తున్నాయి. కాగా, 2030 నాటికి ఈ ఇథనాల్ బ్లెండింగ్‌ను 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది.E20 ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల వాహన ఇన్సూరెన్స్ (భీమా) వర్తించదనే వార్తలను కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఇటీవల తోసిపుచ్చింది. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం సురక్షితమైనదని, వినియోగదారులకు అనుకూలమైనదని మరియు ఆర్థికంగా ప్రయోజనకరమైనదని స్పష్టం చేసింది. ఇథనాల్ కలపడం వల్ల ఇన్సూరెన్స్ పాలసీలు రద్దవుతాయనే వాదనలు ముమ్మాటికీ తప్పని జూన్ 24న మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -