దిశ నిందితుల రీపోస్టుమార్టం రిపోర్టు హైకోర్టుకు చేరింది. ప్రిలిమినరీ రీపోస్టుమార్టం రిపోర్టును హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేసింది ఎయిమ్స్ వైద్యుల బృందం. రిపోర్టుతో పాటు వీడియో సీడీని కూడా రిజిస్ట్రార్‌కు అందించారు వైద్యులు. వారంలోగా సమగ్రమైన రిపోర్టును పంపిస్తామని ఎయిమ్స్ బృందం తెలిపింది. మృతదేహా పరిస్థితి.. వాళ్లు మృతిచెందినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు.. లాంటి కీలకమైన అంశాలపై సమగ్రమైన నివేదిక తయారు చేసేందుకు మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నందున.. ఢిల్లీ వెళ్లిన వారంలోగా సమగ్రమైన నివేదికను పంపిస్తామని ఎయిమ్స్ బృందం పేర్కొంది.
ఇక, ఈ కేసులో విచారణకు కమిషన్ ఏర్పాటు కాగా.. వచ్చే నెల రెండో వారంలో విచారణ కోసం కమిషన్ హైదరాబాద్‌కు రానుంది. ఇప్పటికే ఈ కేసుపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించిన కమిషన్.. తమకు హైదరాబాద్‌లో కల్పించాల్సిన సౌకర్యాలపై తెలంగాణ సీఎస్‌కు లేఖ కూడా రాశారు. అయితే, మొదటి పోస్టుమార్టం రిపోర్టు, రీపోస్టుమార్టం రిపోర్టును కూడా పరిశీలించనున్నారు. దీంతో ఇప్పుడు పోస్టుమార్టం, రీపోస్టుమార్టం నివేదికలు కీలకంగా మారనున్నాయి.