‘మళ్ళీ రావా” వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’.టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా ఈ నెల 11న రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్ శనివారం మీడియా సమావేశంలో పలు విషయాలు తెలియజేశారు.
విడాకుల తీసుకున్న జంట కథే అయినా మళ్లీ వారి జీవితం ఎలా మళ్ళీ మొదలైంది అనేది సినిమా సారాంశం. చాలా సున్నితమైన అంశాన్ని తీసుకుని ఎంటర్‌టైన్‌మెంట్‌లో చూపించాం. తెలుగులో ఇది నా మొదటి సినిమా. 2014లో తమిళంలో ఒక సినిమా చేశాను. ఆ తర్వాత కొన్ని యాడ్స్ చేశాను. బేసిగ్గా నాది చెన్నై. తెలుగులో సినిమా తీయాలనే హైదరాబాద్ షిప్ట్ అయ్యాను. మళ్ళీ మొదలైంది సినిమా నిన్ననే ఓటీటీలో వచ్చింది. చూసిన వారంతా చాలా బాగుందని అభినందనలు తెలియజేస్తున్నారు. కొన్నిచోట్ల క్రిటిక్స్ తనశైలిలో స్పందిస్తున్నారు. ఇది ఫ్యామిలీతో చూసే సినిమా.
సుమంత్‌గారికి నాకు ఓ కామన్ ఫ్రెండ్ వున్నాడు. తన ద్వారా కథ రాసుకున్నాక సుమంత్ కు సినాప్సిస్ మెయిల్ చేశాను. చదివాక నచ్చి పూర్తి కథ పంపమంటే పంపాను. వెంటనే ఆయన చేస్తానన్నారు. ఇది కేవలం ఆయనకే చెప్పా. ఏ హీరోకు చెప్పలేదు. రియలిస్టిక్‌గా వయస్సురీత్యా కథలోని పాత్రకు ఆయన సరిపోతాడని ఆయనకే చెప్పాను. విడాకుల కథ ఫస్ట్ లాక్‌డౌన్‌లోనే రాసుకున్నా. ఈ కథకు స్పూర్తి నా స్నేహితుడు. అతని జీవితంలో విడాకులు, మళ్ళీ పెండ్లి సంఘటనలు జరిగాయి. ఈ సినిమాలో చూపించిన లాయర్ పాత్ర వంటివి మాత్రం సినిమాటిక్‌గా పెట్టాం.
స్క్రిప్ట్ రాసే క్రమంలో విడాకులు తీసుకున్న కొన్ని జంటలను కలిసి వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. దీన్ని సీరియస్‌గా వద్దు. కామెడీ టచ్‌తో చేయమని సలహాలు ఇచ్చారు. ఈ కథ రిస్క్ వుంటుందనే అనుకున్నాం. ఎందుకంటే అన్ని సెక్షన్లకు చేరదు. ఎ,బి ఆడియన్స్‌కు బాగా నచ్చుతుందని భావించాం. ఇందులో ఎటువంటి వల్గారిటీ లేదు. హాయిగా కుటుంబంతో చూసే సినిమా. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుని చేశాం. ఈ సినిమాను థియేటర్ కోసమే చేశాం. ఎడిటింగ్ పూర్తయ్యాక కనీసం మల్లీప్లెక్‌లోనైనా విడుదల చేద్దామని భావించాం. కానీ కరోనా వల్ల థియేటర్ల ఇబ్బంది కావడంతో ఓటీటీ సేఫ్ అని నిర్మాతలు వెళ్ళారు. జీ5 వారికి నచ్చి మంచి ఆఫర్ ఇచ్చారు.
ఈ సినిమాను నిన్న చాలామంది స్నేహితులు యు.ఎస్., బెంగుళూరు, చెన్నైలలో చూశారు. బాగా డీల్ చేశామనే అభినందలు తెలిపారు. ఈ సినిమాను సుమంత్ ఫ్యామిలీ మెంబర్లతోపాటు ఆయన స్నేహితులు కూడా చూసి బాగుందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. నాగార్జునగారు ఇంకా చూడలేదు. చూస్తారని అనుకుంటున్నాం. నాకు కమర్షియల్ సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్‌లో చేయాలంటే ఇష్టం. అందుకే తగిన కథలు రాసుకున్నా. తెలుగు ప్రేక్షకులు లాక్‌డౌన్ సమయంలో చాలా మారిపోయారు. కంటెంట్ బేస్డ్ సినిమాలనే లైక్ చేస్తున్నారు. ఒకరకంగా మంచి పరిణామం. అందుకే కొత్త కథలు రాసేటప్పుడు వారిని దృష్టిలో పెట్టుకుని రాస్తున్నా. నేను తెలుగు, తమిళ, మలయాళం సినిమాలు చూస్తుంటాను. తెలుగులో పుష్ప, అఖండ సినిమాలు చూశాను. భిన్నమైన కంటెంట్‌తో తీసిన చిత్రాలవి అని దర్శకుడు టీజీ కీర్తి కుమార్ తెలిపారు.